Monday, December 23, 2024

ఓట్ల కోసం ఇన్ని పాట్లు, కుట్రలా!

- Advertisement -
- Advertisement -

అగ్గిపుల్లా సబ్బుబిళ్లా, కుక్కపిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏగడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి. ఈ నెల పదవ తేదీన జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నది బిజెపి లక్ష్యంగా కనిపిస్తున్నది. చట్టాన్ని వ్యక్తు లు, నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ), భజరంగ్ దళ్ వంటి సంస్థలు ఉల్లంఘిస్తే వాటి మీద నిషేధంతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో లో పేర్కొన్నారు. పదజాలం ఏదైనా నిషేధం విధిస్తామనే భావం దానిలో ఉంది.దీన్ని అవకాశంగా తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ జై భజరంగ బలీ (జై హనుమాన్) అని నినాదమిస్తూ ఓటు వేయాలని ఎన్నికల సభల్లో పిలుపు ఇచ్చారు. కర్ణాటకలో భజరంగదళ్ అంశం ఏ మేరకు పని చేస్తుందో చూడాల్సి ఉంది.

అక్కడ ఆసంస్థ చరిత్రను చూసినపుడు అనేక ఉదంతాల్లో అది భాగస్వామిగా ఉంది. 2008లో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత కర్ణాటక కోస్తా ప్రాంతంలో చర్చ్‌లు, క్రైస్తవ సంస్థల మీద చేసిన దాడుల గురించి సిఎంగా ఉన్న యెడియూరప్ప జస్టిస్ బికె సోమశేఖర కమిషన్ ఏర్పాటు చేశారు. మరుసటి ఏడాది సమర్పించిన మధ్యంతర నివేదికలో ఆ దాడుల్లో భజరంగదళ్ వంటి మితవాద బృందాలున్నట్లు పేర్కొన్నారు. మంగుళూరు ప్రాంతంలో చర్చ్‌ల మీద దాడులు తామే చేసినట్లు భజరంగ్‌దళ నేతలు పత్రికా గోష్టిపెట్టి మరీ చెప్పారు. గతేడాది షిమోగాలో హలాల్ మాంసం అమ్మాడంటూ ఒక ముస్లిం వ్యాపా రి మీద దాడి చేసిన కేసులు ఆసంస్థకు చెందిన వారిని అరెస్టు చేశారు.ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.

ఒడిషా, కర్ణాటకల్లో జరిపిన హింసాకాండకుగాను విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ మీద నిషేధం విధించాలని 2013లో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ నేత రావ్‌ు విలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. తరువాత అదే పెద్ద మనిషి బిజెపి చంకనెక్కి మంత్రిగా పని చేశారు. చివరిగా బిజెపి మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అల్లుడికి బుద్ధి చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఉచితాల గురించి రచ్చ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో తమ పార్టీ ఉచితాలను సమర్ధించారు. కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో రాష్ర్టం అప్పుల ఊబిలో మునుగుతుందన్నారు. ఉచితాల సంస్మృతి భవిష్యత్తరాల వనరులను హరించి వేస్తుందని, తాము రానున్న పాతిక సంవత్సరాల గురించి ఆలోచిస్తాము తప్ప దగ్గరదారుల్లో వెళ్లం అన్నారు. ప్రతి రోజు బిపిఎల్ కుటుంబాలకు పాల సరఫరా హామీ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఆ రాష్ర్ట పాల రైతులకు మార్కెటింగ్ కల్పించి ఆదుకొనేందుకు అని బిజెపి నేతలు చెబుతున్నారు. మరి అధికారంలో ఇప్పటికే ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదు, కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు ఎందుకు పాలు సరఫరా చేయలేదు? కుటుంబపాలన, అవినీతి గురించి మోడీ పెద్దగా ప్రస్తావించటం లేదు.

ఎందుకంటే 40% అవినీతిపాలన అని బిజెపి సర్కార్ గబ్బుపట్టింది. ఇక యెడియూరప్పను పక్కన పెట్టుకొని కుటుంబపాలన గురించి చెబితే కన్నడిగులు ముఖం మీదే జనం నవ్వుతారు. మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. కశ్మీరులో భద్రతా దళాలకు అధికారం ఇవ్వలేదంటూ ఆర్టికల్ 370 రద్దు, ఏకంగా రాష్ట్రానే రద్దు చేసి కేంద్ర పాలన సాగిస్తోంది. అక్కడ ఒక వైపు ఉగ్రవాదులు భద్రతాదళాల ప్రాణాలు తీస్తుంటే, మరోవైపు కర్ణాటకలో మోడీ ఉగ్రవాదం గురించి ఇతరుల మీద రాళ్లు వేస్తున్నారు.వారితో చేతులు కలిపిన వారి మీద చర్యలు తీసుకుంటే ఎవరు అడ్డుకున్నారు? ఇంతవరకు ఎంత మందిని పట్టుకున్నారు, ఎన్ని కేసులు పెట్టారు? ఉచితాలకు వ్యతిరేకంగా బిజెపి నేత అశ్వనీకుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో కేసు వేశారు. సంక్షేమ చర్యలు అంటే ప్రతిదాన్నీ ఉచితంగా ఇవ్వటం కాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు.

కర్ణాటకలో ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు, ఉచిత ఆహార ధాన్యాల సంగతేమిటి? గత ఏడాది (2022) ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్, ఆరు పదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం (కరోనా పేరుతో రైళ్లలో వృద్ధ స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను, పేదలకు అందుబాటులో ఉన్న పాసింజరు రైళ్లను మోడీ సర్కార్ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకుతేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హోలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. ఇదే ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 202223 బడ్జెట్‌లో రూ. 1200 కోట్లు కేటాయించారు. అవ్‌ుదానీ అఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్ర మోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 39 లక్షల మందికి రెండు ఉచిత గాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది’.

(డెక్కన్ హెరాల్డ్ 2022 నవంబరు13). ‘బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రెండు ఉచితసిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమాచల్‌ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్ ఏప్రిల్ నెలలో ఇండ్ల అవసరాలకుగాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రూ. 250 కోట్లు లబ్ధి చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ర్ట ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 1860 సంవత్సరాల మహిళలకు నెలకు రూ. 1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బిజెపి చేస్తే సంసారం, ఇతరులు చేస్తే మరొకటా ? ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఒక వైపు నరేంద్రమోడీ చూస్తున్నారు. మరోవైపు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రూ. 10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా, ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రూ. 1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది. (2022, డిసెంబరు 13వ తేదీ వార్త). వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా? కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే.

కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్ర మోడీ కార్పొరేట్ పన్నును 30 నుంచి 22కు, 15 శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా? అది దేశానికి, జనానికి లబ్ధి చేకూర్చుతున్నదా? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొక దాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితం గా ఏడాదికి ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగు మందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు.

సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లే ! స్వేచ్ఛా మార్కెట్, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చి వేశారు. ఒకనాడు అపహాస్యం చేసిన పథకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు. తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్‌టిఆర్ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పథకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు.

అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేం. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాల ప్రకారం 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ. 55 లక్షల కోట్లు, మోడీ పదేండ్ల పాలన గడిచే నాటికి అది 169 లక్షల కోట్లకు చేరనుంది. ఇంత అప్పు దేనికి చేసినట్లు, ఎక్కడ నుంచి తెచ్చిందీ, దేనికెంత ఖర్చు చేసిందీ మోడీ చెబుతారా? దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా? పార్లమెంటులో 2017 జూలై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004 05 కస్టవ్‌‌సు, ఎక్సైజ్, కార్పొరేట్, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95 వేల కోట్ల రూపాయలు.

తరువాత అది ఏటేటా పెరుగుతూ వచ్చింది నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత జనానికి అర్ధంగాకుండా లెక్కలను తారుమారు చేసి సరికొత్త పద్ధతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు. 2014 15లో కస్టవ్‌‌సు, ఎక్సైజ్ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రూ. 4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రూ. 1,48,442 కోట్లుగా చెప్పారు. దీని అర్ధం ఖజానాకు మోడీ రూ. 2,87,314 కోట్లు మిగిల్చినట్లా? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 2014 15లో ఎక్సైజ్ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రూ. 99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రూ. 1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020 21నాటికి రూ. 3,72,970 కోట్లకు చేర్చారు. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గాస్ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు. పైన పేర్కొన్నట్లుగా అప్పు తడిచి మోపెడైంది? ఎవరి కోసం బిజెపి పని చేస్తున్నట్లు?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News