Friday, December 20, 2024

కర్నాటక ఎన్నికలు: నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు..

- Advertisement -
- Advertisement -

కర్నాటక క్లైమాక్స్
నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు
10న జరిగే అసెంబ్లీ ఎన్నికలు
బిజెపి కాంగ్రెస్ హోరాహోరీ
బెంగళూరు: దక్షిణాది రాష్ట్రం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార ఘట్టం నేటితో (సోమవారం) ముగుస్తుంది. పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. అధికారంలో ఉన్న బిజెపికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోన్న ఈ రాష్ట్రంలో ప్రాబల్యపు జెడిఎస్ గణనీయ రీతిలో తన ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా ప్రముఖ నేతల ప్రచారం, ప్రత్యేకించి ప్రధాని మోడీ రోడ్‌షోలతో ప్రచారం వేడెక్కింది. ప్రధాని మోడీ ఆదివారం బెంగళూరులో భారీ రోడ్‌షో నిర్వహించారు. శనివారం కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ హుబ్లీ లో ప్రచార సభలో పాల్గోన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక పవనాలను అధిగమించేందుకు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి యత్నిస్తోంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ కీలక అసెంబ్లీ ఎన్నికలలో తమ గెలుపుతో కాంగ్రెస్‌కు పూర్వపు జవసత్వాలను రంగరింపచేసుకోవాలని ఈ పార్టీ వర్గాలు సాగుతున్నాయి.ఈ పార్టీలో ప్రముఖ నేతలు స్థానిక కుల మత రాజకీయాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, ప్రత్యేకించి బిజెపి ప్రభుత్వ అవినీతిని ప్రస్తావిస్తూ ప్రచార పర్వంలో ఉన్నారు. అమిత్ షా ఇక్కడ తొలి దశలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నా తరువాతి రోజులలో ఇక్కడ మోడీనే ప్రధాన కేంద్ర బిందువుగా ప్రచారం సాగుతోంది.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని తెలియచేస్తూ ఈ పద్ధతిలో సాగే సర్కారు రావాలని లేకపోతే కర్నాటక ప్రగతి వీలు కాదని తెలియచేస్తున్నారు. ఇక ప్రధాని ఇక్కడ బజ్‌రంగ్ భళిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ తరఫున సోనియా ఒకే ఒక్క సభలో ప్రసంగించారు. రాహుల్, ప్రియాంకలు పలు చోట్ల ఖర్గే, శివకుమార్ ఇతర నేతలతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో తాము కింగ్ మేకర్ల పాత్ర కాకుండా తాము కింగ్‌ల స్థానంలోకి వస్తామని తెలియచేస్తూ జెడిఎస్ అధినేత దేవెగౌడ సాధ్యమైనంత ఎక్కువ సభల్లోనే పాల్గొన్నారు. కుమారుడు కుమారస్వామి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదిపారు.

గత నెల 29 నుంచే ప్రధాని మోడీ తమ సుడిగాలి ప్రచారం సాగిస్తూ వచ్చారు. కన్నడిగులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బిజెపి తరఫున అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ అధ్యక్షులు జెపినడ్డా ఇక్కడ విస్తృతస్థాయిలోనే ప్రచారం సాగించారు. అయితే ప్రధాని మోడీ తన హోదాకు అతీతంగా వ్యవహరిస్తూ కర్నాటక ఎన్నికలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. తగు విజయావకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇక్కడ ఆశించిన రీతిలో ప్రచార ప్రభావం చూపలేకపోయిందని వారు పేర్కొన్నారు. కర్నాటకలో 10వ తేదీన ఏక దశలో జరిగే ఎన్నికల కౌంటింగ్ 13న జరుగుతుంది, ఫలితాలు అదేరోజు వెలువడుతాయి. రాష్ట్ర అసెంబ్లీ 224 స్థానాలు ఉన్నాయి.

Also Read: కర్నాటక ప్రచారంలో అమిత్ షా అసహనం.. బిజెపి నేతలపై సీరియస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News