Thursday, January 23, 2025

కన్నడనాట రేపే ఎన్నికల ఫలితాలు..

- Advertisement -
- Advertisement -

కన్నడ గడబిడ
రేపే ఎన్నికల ఫలితాలు… సందిగ్ధ అసెంబ్లీకి సర్దుబాట్లు
జెడిఎస్ వైపు కాంగ్రెస్ బిజెపిల దృష్టి
కీలక నేతల మంతనాలు.. ఢిల్లీస్థాయి సంకేతాలు
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం (13వ తేదీన) వెలువడుతాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని తెలిపాయి. అయితే కాంగ్రెస్ అత్యధిక సంఖ్యలో స్థానాలు దక్కించుకుంటుందని, బిజెపి రెండో అతి పెద్ద పార్టీగా మిగిలి అధికారం పోగొట్టుకుంటుందని తెలిపాయి. ఈ క్రమంలో ఏర్పాటు అయ్యే హంగ్ అసెంబ్లీలో జెడిఎస్ పాత్ర కీలకం అవుతోంది.

తీవ్రస్థాయి పోటీ తరువాతి ఫలితాల దశలో బిజెపి, కాంగ్రెస్‌లలో కలవరం పట్టుకుంది. ఎన్నికలలో స్పష్టమైన మెజార్టీ వస్తుందని రెండు ప్రధాన పార్టీలు ఆశించాయి. అయితే హంగ్ ఉంటుందనే అంచనాల నడుమన ఎన్నికల దశ ముగిసిన తరువాత ఈ పార్టీల నేతలకు ఇప్పుడు ప్రభుత్వ స్థాపన విషయంపై కూడగట్టుకునే మద్దతు ఊపిరి సల్పనివ్వని స్థితికి తెచ్చింది. సందిగ్ధపు అసెంబ్లీలో అధికార స్థాపనకు ఖచ్చితంగా ఇతర పార్టీలు ప్రత్యేకించి జెడిఎస్ మద్దతు దక్కించుకోవల్సిన స్థితిలో కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎక్కువగా హడావిడి ఉంది.

సింగపూర్‌కు వెళ్లిన కుమారస్వామి
రెండు ప్రధాన పార్టీల దృష్టి ఇప్పుడు జెడిఎస్‌పై కేంద్రీకృతం అయింది. అయితే హంగ్ అసెంబ్లీలో ప్రభుత్వ స్థాపన తాళాలను పొందే స్థితికి చేరుకున్నాడని భావిస్తున్న జెడిఎస్ నేత కుమారస్వామి ఇప్పుడు దేశంలో లేరు. సాధారణ ఆరోగ్య పరీక్షలకు ఆయన సింగపూర్ వెళ్లారు. కౌంటింగ్ తేదీన తిరిగి వస్తారు. ఎన్నికల ప్రచారం దశలో ఎండలతో కుమారస్వామి నిస్సత్తువకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అయితే కోలుకుని తిరిగి ప్రచారం చేశారు. ఎందుకైనా మంచిదని ఆరోగ్య చికిత్సకు సింగపూర్‌కు ప్రయాణం కట్టారు.

సంకీర్ణ ప్రభుత్వం తప్పదా?
హంగ్ నేపథ్యంలో వెనుక నుంచి మద్దతు ప్రక్రియ కాకుండా ప్రభుత్వంలో పాలుపంచుకునే పావునే జెడిఎస్ కదుపుతుంది. ఈ విధంగా సంకీర్ణ ప్రభుత్వానికి ఓకె అంటేనే మద్దతుకు ముందుకు వస్తుందని భావిస్తున్నారు. జెడిఎస్ పాత్ర ఏమిటనేది ఇతరుల పార్టీల కదలికలు ఏమిటనేవి ఫలితాలు వచ్చిన తరువాతనే తెలుస్తాయని ఓ సీనియర్ నేత తెలిపారు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 104 స్థానాలతో అతి పెద్ద పార్టీ అయింది. తరువాతి స్థానంలో కాంగ్రెస్‌కు 80 స్థానాలు దక్కాయి. జెడిఎస్‌కు 37 సీట్లు వచ్చాయి. ఓ ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నారు. బిఎస్‌పి, కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కెపిజెపి) పార్టీలకు ఒక్కో స్థానం వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్, జెడిఎస్‌లు ఎన్నికల అనంతర కూటమికి యత్నించాయి. ఈలోగానే అతి పెద్ద పార్టీ హోదాతో బిజెపి నేత యడ్యూరప్ప ప్రభుత్వ స్థాపనకు ముందుకు రావడం సిఎం కావడం జరిగింది.

అయితే బలపరీక్షకు ముందు సరైనబలం లేదని తేలడంతో మూడురోజుల ముందు బిజెపి ప్రభుత్వం రద్దు అయింది. తరువాత జెడిఎస్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం కూలింది. అధికార పక్షం నుంచి ఈ ఎమ్మెల్యేలు బిజెపిలోకి ఫిరాయించడం తరువాతి వేగవంతపు చర్యలతో తిరిగి బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చింది, ఆ తరువాత సిఎంగా బస్వరాజ్ బొమ్మైను బిజెపి అధిష్టానం ఎంచుకుంది.
సిద్ధరామయ్యతో సూర్జేవాలా భేటీ శనివారం ఫలితాల దశలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా బెంగళూరులో సిఎల్‌పి నేత, మాజీ సిఎం సిద్ధరామయ్యను ఆయన నివాసంలో కలిశారు. పరిస్థితిని సమీక్షించారు.

హంగ్ రాదు మేమే వస్తాం: బొమ్మై
మరో వైపు తమకు సంపూర్ణ లేదా ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన స్థానాలు వస్తాయని సిఎం బొమ్మై గురువారం విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై స్పందిస్తూ ఇవి పూర్తిస్థాయిలో ఎప్పుడూ నిజం కాలేదన్నారు. ఇప్పుడు కూడా ఇదే అవుతుందన్నారు. మోడీ ప్రచారంతో తమ పార్టీ బాగా పుంజుకుందన్నారు. హంగ్ రాదని చెపుతున్న తను దీని గురించి మాట్లాడేందుకు ఏమీ లేదని చెప్పారు.

141కు తక్కువ రావు: డికె
కాగా కాంగ్రెస్‌కు ఖచ్చితంగా 141 అంతకు మించి వస్తాయని, తాము అధికారంలోకి వస్తామని పిసిసి అధ్యక్షులు రాష్ట్రంలో పార్టీ గట్టి మనిషి డికె శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. కనకపురా నియోజకవర్గంలో ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇక్కడి జనం అందించిన మద్దతు కేవలం తనకే కాదని, మొత్తం కన్నడిగుల పట్ల కనబర్చిన ఆదరణ అన్నారు. ఇక్కడి ప్రతి ఇంటి వ్యక్తి ఓ అభ్యర్థి అయ్యి పనిచేశారని, ఇక ఎన్నికల విజయం తిరుగులేనిదే అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News