Friday, November 22, 2024

సంజీవనిలా పనిచేసిన భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర సంజీవనిలా పనిచేసిందని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీకి, భారత్ జోడో యాత్రను పోల్చిచూస్తే రాహుల్ యాత్రనే విజయం సాధించిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 30న చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ వద్ద కర్నాటకలో ప్రవేశించింది.

చామరాజనగర్, మైసూరు, మాండ్య, తుంకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూర్ మీదుగా కర్నాటకలో 500 కిలోమీటర్ల మేరకు 22 రోజులపాటు కర్నాటకలో యాత్ర సాగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగుపరచడంలో భారత్ జోడో యాత్ర కీలకపాత్ర పోషించినట్లు రమేష్ చెప్పారు. జోడో యాత్ర సంజీవనిలా పనిచేసిందని, పార్టీ కార్యకర్తలు, నాయకులలో ఐక్యతను, సంఘీభావాన్ని పెంపొందించిందని ఆయన చెప్పారు.

కర్నాటకలో 22 రోజుల పాటు రాహుల్ భారత్ జోడో యాత్ర సాగిందని, గత ఏడాది అక్టోబర్‌లో వానలో తడుస్తూ రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న ఫోటోలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని కాంగ్రెస్ పార్టీ మీడియా, పబ్లిసిటీ విభాగాధిపతి పవన్ ఖేరా చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నిర్వహించిన ఎన్నికల ప్రచారం కూడా పార్టీ విజయానికి దోహదపడ్డాయని ఆయన చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మార్గదర్శనంలో పార్టీ విజయం సాధించిందని ఖేరా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News