Monday, December 23, 2024

కర్ణాటక ఫలితం!

- Advertisement -
- Advertisement -

ఎంతో కాలంగా, ఎంతో ఉత్కంఠ రేపిన కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఎవరి అంచనాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ మెడలో గజమాల వేశాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన చివరి అంచనాలు కూడా ఎక్కడా నిలబడకుండా, వరదలో గడ్డి పోచలా కొట్టుకుపోయాయి. కాంగ్రెస్‌కు బొటాబొటీ మెజారిటీ వస్తుందని, హంగ్ తప్పదని, మళ్ళీ జెడి(ఎస్) నేత కుమార స్వామి రొట్టె విరిగి నేతిలో పడుతుందని రోజుల తరబడి రక్తి కట్టించిన జోస్యాలేవీ రుజువు కాలేదు. ఎకాఎకీ బిజెపి (65)కి రెట్టింపు పైచిలుకు (136) స్థానాలతో కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు ఓట్లాభిషేకం చేయడం ఆశ్చర్యం కలిగించింది. కన్నడ ఓటరు తన వైఖరిని ఏనాడో నిర్ధారించుకొన్నట్టు బోధపడుతున్నది. అప్పటి నుంచి ఆ నిర్ణయం ఉక్కు సంకల్పంగానే కొనసాగింది కాని, ఎక్కడా బెసకలేదని అర్థమవుతున్నది.

బిజెపి అతి కష్టం మీద కాంగ్రెస్, జెడి(ఎస్) పాలనను అంతమొందించి అధికారం చేజిక్కించుకొన్నప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చి కూడా ప్రజలకు ఇష్టమైన పాలనను అందించడానికి బొత్తిగా ప్రయత్నించలేదు. 2018 ఎన్నికల్లో బిజెపి అతి పెద్ద పార్టీగా వచ్చింది. కాని కాంగ్రెస్, జెడి(ఎస్) ఏకమై దానికి అధికారం దక్కనివ్వరాదని నిర్ణయించుకొని శాసన సభలో మెజారిటీని నిరూపించుకోడానికి తగిన బలాన్ని సమకూర్చుకొన్నాయి. ఆ ఘట్టమేదో తేలకుండానే అప్పటి గవర్నర్ వజుభాయ్ వాలా యెడ్యూరప్ప చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, యెడ్యూరప్ప విశ్వాస ఓటింగ్‌లో బల నిరూపణ చేసుకోలేక దిగిపోడం తెలిసిందే.

ఆ తర్వాత కొన్నాళ్ళకు కాంగ్రెస్, జెడి(ఎస్)ల ఉమ్మడి బలాన్ని దెబ్బ తీసి బిజెపి కర్ణాటక అధికారాన్ని చేజిక్కించుకొన్నది. తాము ఆమోదించే ప్రతి కాంట్రాక్టుకూ 40% కమీషన్ వసూలు చేసే దుర్విధానాన్ని బిజెపి మంత్రులు అమలు చేయడం ప్రజల్లో అవధులు మీరిన అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగించింది. ఈ కమీషన్ చెల్లించలేక ఆత్మహత్య చేసుకొన్న కాంట్రాక్టర్ల ఉదంతాలు కూడా వున్నాయి. రూ. 16 కోట్ల స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులను ఆమోదింప చేసుకోడానికి వెళ్ళగా కమీషన్ అడిగారని గత డిసెంబర్ చివరిలో బెంగళూరుకు 70 కి.మీ దూరంలోని తుమకూరు జిల్లాకు చెందిన టిఎన్ ప్రసాద్ అనే 50 ఏళ్ళ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. 2022 ఏప్రిల్‌లో మరో కాంట్రాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి కెఎస్ ఈశ్వరప్ప అనే మంత్రి రాజీనామా చేశారు. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం 40% కమీషన్ల ప్రభుత్వమనే మాట ఇంటింటా మార్మోగింది. దీనికి తోడు బిజెపి హిందుత్వ పూనకం దానికి ఈ ఓటమి ‘పానకా’న్ని తాగించడంలో ముఖ్యపాత్ర పోషించిందని స్పష్టపడుతున్నది.

ఉత్తరాదిలో మాదిరిగా దక్షిణాదిలో కూడా కఠినాతి కఠిన అమానుష హిందూత్వాన్ని అమలు పరిచి మెజారిటీ హిందూ ఓట్లను సాధించుకుందామని బిజెపి పెట్టుకొన్న ఆశలు ఈ విధంగా దాని చేత ఘోర పరాజయాన్ని చవిచూపించాయి. ముస్లింలకు ఇస్తూ వచ్చిన 4 % రిజర్వేషన్లను రద్దు చేసి అధిక సంఖ్యాకులైన లింగాయత్‌లకు, ఒక్కళిగలకు చెరి 2% పంచిపెడుతూ తీసుకొన్న నిర్ణయం కన్నడ ప్రజానీకం తిరస్కారానికి గురైంది. రాష్ట్ర జనాభాలో గణనీయంగా (దాదాపు 13 శాతం) వున్న ముస్లింలను పనికట్టుకొని వేధించడాన్ని అక్కడి ప్రజలు హర్షించలేదని అనుకోవలసి వుంది. హిజాబ్ వివాదాన్ని గరిష్ఠ స్థాయికి రెచ్చగొట్టడం కూడా వారికి నచ్చలేదని భావించాలి. ఇది సెక్యులర్ భారతానికి ఎనలేని భరోసా. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో మాదిరిగా కర్ణాటకలో కూడా తన ‘దివ్య మంగళ విగ్రహా’న్ని చూపించడం ద్వారా ప్రజల ఆమోదాన్ని సాధించుకోగలనని అతిగా అనుకొని దెబ్బ తిన్నారు. ఎన్నికల ఘట్టానికి ముందు బెంగళూరులో జరిపించిన 26 కి.మీ నిడివి రోడ్ షో కాకుండా 7 రోజుల్లో 19 బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. అయినా గిట్టుబాటు కాలేదు.

ఉత్తరాది మాదిరిగా తన వంటి వారిని చూసి వ్యక్తి ఆరాధనలో కొట్టుకుపోయే బలహీనులు దక్షిణాదివారు కాదని ఆయన ఇప్పటికైనా తెలుసుకోవలసి వుంది. దక్షిణాదిలో తన ప్రవేశానికి ముఖ ద్వారంగా ఉపయోగపడగలనని సంకేతం ఇచ్చిన కర్ణాటకను బిజెపి ప్రస్తుతానికి పూర్తిగా జారవిడుచుకొన్నది. ఇది దాని మితిమించిన ఆత్మవిశ్వాసం ఫలితం. ఈ గెలుపుతో కాంగ్రెస్ తనకు ఎదురులేదనుకొంటే పొరపాటే. ఒక వైపు కర్ణాటక ప్రజలు తనపై వుంచిన బాధ్యతను నెరవేరుస్తూ ఈ విజయమే మళ్ళీమళ్ళీ రుజువవుతుందనే ధీమాకు అది పోకూడదు. ఇది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విజయమే. ఏ రాష్ట్రంలో వుండే పరిస్థితులను బట్టి అక్కడి ఓటర్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పును ఇస్తుంటారు. అందుచేత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలంటే అది అధికారంలో వున్న రాష్ట్రాల్లో దానిని గద్దె దించాలి. దేశ పాలనలో బిజెపి వైఫల్యాలను, హిందుత్వ దుస్సాహసాలను గురించి ప్రజలకు వివరంగా చెప్పి వారిని ఆకట్టుకోవాలి. అందుకు కాంగ్రెస్ ఒక్క పార్టీ బలం చాలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News