Wednesday, January 22, 2025

పని చేయని బిజెపి కుప్పిగంతులు!

- Advertisement -
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గెలిపించడం ద్వారా వచ్చే ఏడాదిలోగా జరిగే పది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలిచేటట్లు చేయడంతో పాటు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని నిరూపించుకోవడం కోసం బిజెపి పడిన శ్రమ ఫలించలేదు. పైగా, 2024లో తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే ఇప్పుడు ఉన్న సీట్లలో ఏర్పడే లోటును భర్తీ చేసుకోవడం కోసం దక్షిణాదిన విస్తరించడమే మార్గం అనుకొంటూ ప్రయత్నాలు చేస్తున్న బిజెపికి ఈ ఫలితాలు పెద్ద ఎదురు దెబ్బగా పరిణమించాయి. ఉత్తరాదిన అనుసరిస్తున్న వ్యూహాలు దక్షిణాదిన చెల్లుబాటు కాబోవని మరోసారి రుజువైంది. అంతేకాదు, దక్షిణాది ప్రజల మనసులను గెల్చుకొనే ప్రయత్నం చేయకుండా భావోద్వేగాలను సృష్టించి లబ్ధి పొందే విధంగా చేసిన ప్రయత్నాలు వికటించాయి. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధాన మంత్రి కూడా ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తిరగనంత విధంగా విస్తృతంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జరిపిన ప్రచారం ఫలించలేదు.

ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో కూడా ప్రధాని మోడీ ఇంతగా ప్రచారం చేయలేదు. బెంగళూరు నగరంలో రెండు రోజులపాటు రోడ్ షో జరిపారు. అయితే ఈసందర్భంగా కర్ణాటకలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజలు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలకు పరిష్కారాలు చూపే ప్రయత్నం చేయకుండా ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తి పోసేందుకు ఎక్కువగా ప్రయత్నం చేశారు. కనీసం బిజెపి ఎన్నికల ప్రణాళికలో చేసిన ఉచిత గ్యాస్ సిలెండర్లు వంటి హామీలను ప్రచారం చేసుకొనే ప్రయత్నం చేయకుండా ప్రధాని వంటి వ్యక్తి ‘జై బజరంగ్ భలి’ అంటూ ఓటు వేయమని, దేవాలయాలలో హనుమాన్ చాలీసా ప్రవచింపమని చెబుతూ ఎన్నికల ప్రచార సభలలో పిలుపు ఇవ్వడం గమనిస్తే ప్రజా సమస్యల గురించి ప్రజల ముందు ప్రస్తావించే సాహసం బిజెపి నేతలు చేయలేకపోతున్నారనే సంకేతం ఇచ్చినట్లయింది. చివరి రెండు, మూడు రోజులు బిజెపి నేతలతో పాటు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు సహితం సామూహిక హనుమాన్ చాలీసా పాటిస్తూ గడిపారు. హనుమంతుడు తమను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వ వ్యతిరేకత నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ప్రధాని వ్యూహాత్మకంగా చేసిన్నట్లు అర్థం చేసుకున్న ప్రజలు తమదైన రీతిలో తీర్పు ఇచ్చారు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు పని చేయవనే నానుడి నిజమని రుజువైంది.

2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధానంగా ‘అవినీతిపై పోరాటం’ అనే నినాదం సహకరించింది. ఇప్పుడు కర్ణాటకలో అధికారం కోల్పోయింది కూడా అవినీతి ఆరోపణలపైనే కావడం గమనార్హం. కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతి పనిలో 40 శాతం కమీషన్ అడుగుతున్నారని ఆరోపణలు చేస్తున్నప్పుడు తగు దర్యాప్తులు జరిపే ప్రయత్నం చేసి, సాధికారికంగా ఆ ఆరోపణలను కొట్టిపారవేసే ప్రయత్నం చేయలేదు. పైగా, ప్రధాని స్వయంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 85 శాతం కమీషన్లు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ లాజిక్ ను ప్రజలు స్వీకరించలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్‌లో మాదిరిగా సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకుండా ప్రభుత్వ వ్యతిరేకతను కట్టడి చేసే ప్రయత్నాలు ఫలించలేదు. ‘జనరేషన్ మార్పు’ అని చెప్పినప్పటికీ ఆ పేరుతో ప్రజాబలం గల నేతలను పక్కకు నెట్టి, భజనపరులను అందలం ఎక్కించే ప్రయత్నం జరుగుతున్నదనే అభిప్రాయం బలపడింది.

అసలు అభ్యర్థుల ఎంపిక సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప ఇటువంటి అభ్యర్థులతో ఎన్నికలలో విజ యం సాధింపలేమని ఢిల్లీలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన మాటలను నిజం చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో బిజెపికి గట్టి మద్దతుదారులుగా ఉంటూ, ఆపార్టీ అధికారం చేపట్టేందుకు దోహదపడిన లింగాయత్ సామాజిక వర్గంలో బిజెపి పట్టు సడలుతున్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సామాజిక వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతల పట్ల అవమానకర రీతిలో వ్యవహరించడం, యెడ్యూరప్పను అవమానకరంగా గద్దె దింపారనే ప్రచారం జరగడం, ఎన్నికల అనంతరం తిరిగి తమ సామాజికవర్గం నుండే ముఖ్యమంత్రి ఉంటారనే ప్రకటన చేయమని యెడ్యూరప్ప కోరినా చేయకపోవడంతో బిజెపిపట్ల వారిలో విశ్వాసం సన్నగిల్లేటట్లు చేసినట్లు కనిపిస్తుంది. కులం ఓట్లపై ఆధారపడకుండా, సామాజిక ప్రాతిపదికను విస్తృతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నామని బిజెపి నేతలు అభ్యర్థుల ఎంపిక సమయంలో చెప్పినప్పటికీ అటువంటి ప్రభావం ఎన్నికల్లో చూపినట్లు లేదు. ముఖ్యంగా బిజెపి విస్తరించేందుకు ఎంతో పట్టుదలతో పనిచేస్తున్న ఎస్‌సి, ఎస్‌టి గ్రామీణ నియోజకవర్గాల్లో ఉన్న కొద్దిపాటి బలాన్ని కూడా బిజెపి కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది. జెడి(ఎస్)కు బలంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో బిజెపి తన బలాన్ని కొంత మేరకు పెంచుకోగలగడంతో జెడి(ఎస్) బలహీనపడి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఎక్కువగా సీట్లు గెలుచుకునేందుకు దోహదపడింది.

పైగా, రాష్ట్రాలలో బలమైన నాయకులు ఎదగనీయకుండా వ్యూహాత్మకంగా కీలుబొమ్మల వంటి నాయకులను ప్రోత్సహిస్తూ రావడం సహితం బిజెపిని దెబ్బతీసింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా రాబోయే ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చతీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాలపై కూడా పడుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌లో మినహా బిజెపి అధికారంలోలేదు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, దక్షిణాదిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో బలం పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు అన్నింటికీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇప్పటి వరకు ఎక్కడైనా, ఏ ఎన్నికైనా ప్రధాని మోడీకి గల ప్రజాకర్షణతో గెలుపొందగలమనే బిజెపి శ్రేణులలో ధీమాకు కర్ణాటకలో ఇప్పుడు బీటలు పడింది.

ఆయన ప్రజాకర్షణ శక్తికీ పరిమితులు ఉన్నాయని గతంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలతోనే వెల్లడైనది. ఆ విషయం గ్రహించి, ప్రత్యామ్నాయ వ్యూహాలు అనుసరించే ప్రయత్నం చేయడం లేదు. కర్ణాటక ఎన్నిక ఫలితాలకు రెండు రోజుల ముందే ఢిల్లీ, మహారాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ల ప్రవర్తనపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సహితం బిజెపి అనుసరించే 2024 ఎన్నికల వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు బిజెపి ప్రతినిధులవలె వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా నిర్వహించవలసిన బాధ్యతల విషయంలో వివాదాలకు గురవుతున్నారు.
ఆ విధంగా గవర్నర్లు తమ హోదాను, పరిమితులను మించి వ్యవహరిస్తున్న కారణంగా ఆయా రాష్ట్రాల్లో బిజెపి ప్రజలలో నవ్వులపాలవుతున్నదనే అంశాన్ని గ్రహించలేకపోతున్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా రోజువారీ పాలనా యంత్రాంగపు వ్యవహారాలలో సహి తం తల దూరుస్తుండటం పట్ల సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.

అదే విధంగా మహారాష్ర్టలో ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేయకుండా ఉండినట్లయితే తిరిగి ఆ పదవిలో నియమించే అవకాశం ఉండేదని సుప్రీంకోర్టు పేర్కొనడం ప్రతిపక్ష రాష్ట్రాలలో గవర్నర్ల వ్యవహార తీరుపై అభిశంసన వంటిదే. మహారాష్ర్టలో థాకరే అధికారంలో కొనసాగి ఉండినట్లయితే భాగస్వామ్య పార్టీలు బజారునపడి, బిజెపికి విశేష ప్రజాదరణ లభిం చి వచ్చే లోక్‌సభ ఎన్నికలలో భారీ విజయం సాధించి ఉండెడిది. కానీ, ఇప్పుడు థాకరే పట్ల ప్రజలలో సానుభూతి పెరిగిందని, ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే వెంట ఎంఎల్‌ఎ లు ఉన్నప్పటికీ ప్రజలు లేరని బిజెపి గ్రహించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితులలో మొత్తం 48 సీట్లలో ప్రతిపక్షాలు 35 వరకు గెల్చుకుంటాయని అంతర్గత సర్వేలు తెలుపుతున్నాయి. అందుకనే అజిత్ పవార్‌ను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా ఎన్‌సిపిని చీల్చి తమ బలం పెంచుకోవాలని బిజెపి వేసిన ఎత్తుగడను గ్రహించిన శరద్ పవార్ ‘రాజీనామా అస్త్రం’తో చిత్తు చేశారు.

ఇడి కేసులు ఎదుర్కొంటున్న పలువురు ఎన్‌సిపి నాయకులు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గ్రహించిన పవార్ ఈ అస్త్రం ప్రయోగించినట్లు తెలుస్తున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాల్లో బిజెపికి లోక్‌సభ సీట్లు తగ్గితే ఆమేరకు అదనంగా సీట్లు గెలుచుకునే రాష్ట్రాలు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో సీట్లున్నాయి. వాటిల్లో కొద్దో గొప్పో సీట్లు తగ్గడమే గాని, పెరిగే అవకాశాలు లేవు. అందుకనే కర్ణాటకలో ఓటమిని సింహావలోకనం చేసుకొని, నాయకత్వం స్థాయిలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం చేయనిపక్షంలో 2024 ఎన్నికల్లో సొంత బలంపై తిరిగి అధికారంలోకి రావడం ఇబ్బందికరమయ్యే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు నియోజక వర్గాలలో కర్ణాటకలో బిజెపికి పరాజయం ఎదురవ్వడం గమనార్హం.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News