Monday, December 23, 2024

పాడిపై రాజకీయ వేడి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రచార రథం అనేక మందు పాతరల మీది నుంచి ప్రయాణం చేస్తుంది. అవి పేలేటప్పుడు రగిలే భావోద్వేగాల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడుతుంది. మన దేశ ప్రజలకున్న శాస్త్రీయ చైతన్యం, నిష్పాక్షిక దృక్పథం పరిమితం కాబట్టి ఇక్కడ ఈ భావోద్వేగాలను పనికట్టుకొని రెచ్చగొట్టే కార్యక్రమం కూడా అపరిమితంగా సాగిపోతుంది. కర్ణాటకలో శాసన సభ ఎన్నికల రంగం హోరాహోరీగా నడుస్తున్నది. మే 10వ తేదీన జరిగే పోలింగ్ కోసం అక్కడ మూడు ప్రధాన రాజకీయ పక్షాలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. కేంద్ర పాలక పక్షం భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రంలో చేజిక్కిన అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోరాదని దృఢ సంకల్పం వహించింది. దక్షిణాదిలో తన పాలనలో గల ఏకైక రాష్ట్రం గనుక అక్కడ పట్టుకోల్పోరాదని ఆశించి అందుకు అనుగుణంగా కృషి చేస్తున్నది.

అయితే చెప్పనలవికాని అవినీతి కారణంగా కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనం వీస్తున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యాలు కూడా వెలువడ్డాయి. మూడోశక్తి జెడి(ఎస్) వీలైనన్ని స్థానాలు గెలుచుకొని బిజెపి, కాంగ్రెస్‌లలో దేనికీ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ అవతరించేలా చూసి అవి తన మద్దతుపై ఆధారపడక తప్పని పరిస్థితిని సృష్టించుకోవాలని ఆరాటపడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం రొట్టె విరిగి పాలల్లో పడింది. బెంగళూరులో ఇ కామర్స్ ద్వారా తమ పాలు, పెరుగు ఇంటింటికీ అందుబాటులోకి తేదలచినట్లు దేశంలోనే ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద పాడి సహకార సంస్థ అమూల్ చేసిన ప్రకటన విపక్షానికి అయాచితంగా అందివచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత డిసెంబర్‌లో మాండ్యాలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్ నందిని పాల ఉత్పత్తి సహకార సంస్థ) కు చెందిన మెగా డెయిరీ ప్రాజెక్టును ప్రారంభించారు.

ఆ సందర్భంగా మాట్లాడుతూ అమూల్, నందిని మధ్య సహకారంతో పాడి పరిశ్రమలో అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్ర నాయకుడు సిద్ధ రామయ్య ఈ రెండింటికీ ముడిపెట్టి నందినిని అమూల్‌లో విలీనం చేసే కుట్ర సాగుతున్నదని ఆరోపించారు. ఎన్నికల వేడిలో అది దావానలంలా వ్యాపించింది. జెడి(ఎస్) కూడా గొంతు కలపడంతో భారీ ఎత్తు నిరసన ప్రదర్శనలు చోటు చేసుకొని అమూల్ పాలను రాష్ట్రంలో వినియోగించరాదని తీర్మానం చేసేంత వరకు వెళ్ళింది. దేశంలో పాడి పరిశ్రమ పిత అనిపించుకున్న డాక్టర్ వర్గీస్ కురియన్ చేతుల మీద ప్రారంభమై అనూహ్య స్థాయిలో పెరిగి పెద్దదైన అమూల్ గుజరాత్‌కు చెందినది కావడం ఇక్కడ గమనించవలసిన విషయం. గుజరాత్‌కు చెందిన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్పొరేట్ రంగాన్ని మొత్తం గుజరాతీయుల పెత్తనంలోకి తీసుకు వెళ్ళినట్టే పాడి పరిశ్రమను కూడా గుజరాత్ గుత్తాధిపత్యంలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారనే అభిప్రాయం నాటుకొన్నది.

సోమవారం నాడు కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు బెంగళూరులోని మైసూర్ బ్యాంకు సర్కిల్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన అమూల్‌పై ఆ రాష్ట్రంలో పెల్లుబికి వ్యాపించిన ఆందోళనకు తాజా నిదర్శనం. ఆందోళనకారులు రోడ్లపై అమూల్ ఉత్పత్తులను విసిరివేసి రాష్ట్రంలో వాటి అమ్మకాన్ని అనుమతించబోమని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా వందలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నందిని పాలను అమూల్ కబళించడాన్ని ఎంత మాత్రం జరగనివ్వబోమని ఆందోళనకారులు శపథం చేశారు. సహకార రంగంలో పాడి పరిశ్రమ సాధించిన విజయాలు అసాధారణమైనవి. గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ రైతు కుటుంబాలు ఉత్పత్తి చేసే పాలను సేకరించి పట్టణ, నగర ప్రాంతాల్లో విరివిగా విక్రయించడం ద్వారా సహకార రంగంలో వటవృక్షాలుగా మారిన పాడి పారిశ్రామిక సంస్థలు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి.

ఇందులో అమూల్ ఉత్పాదక సంస్థ గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ రూ.72 వేల కోట్ల టర్నోవర్‌తో దేశంలో అగ్రగామిగా వుండగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రూ. 25 వేల కోట్ల టర్నోవర్‌తో రెండో స్థానంలో వుంది. నందిని పాల సేకరణ ఆ రాష్ట్రంలోని పల్లె ప్రాంతాల పాడి రైతులతో ముడిపడి వున్నందున 120 నియోజకవర్గాల్లో ఈ వివాదం ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కెఎంఎఫ్‌కు కర్ణాటక వ్యాప్తంగా 14 పాల సంఘాలున్నాయి. గతంలో బ్యాంకుల విలీనం జరిపినప్పుడు కూడా దక్షిణాదిలోని విజయ, ఆంధ్రా బ్యాంకు వంటి వాటిని మూసివేసి ఉత్తరాది, గుజరాత్ (బ్యాంక్ ఆఫ్ బరోడా) బ్యాంకులలో విలీనం చేసిన మాదిరిగానే ‘నందిని’ని కబళిస్తారనే ప్రచారం జరుగుతున్నది. బిజెపికి ఇది తీవ్ర హాని కలిగించే అవకాశాలు వున్నాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో తమకు మించిన వారు లేరనుకునే కమలనాథులకు ఇది అగ్ని పరీక్ష వంటిదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News