Wednesday, January 22, 2025

సరిహద్దుల్లో కర్నాటక చిచ్చు

- Advertisement -
- Advertisement -

కొడంగల్: కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు తెలిపారు. బుధవారం కర్నాటక రాష్ట్రం సేడం, ముదోల్, రెబ్బనపల్లి, మేత్కు, చిల్లర్ కోట్రిక, నాడేపల్లి, పాకాల, కండ్రేపల్లి, చందాపూర్‌లకు చెందిన రైతులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తు కొడంగల్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలని ఆగం చేశారని రైతులు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యవసాయానికి కరెంటు లేక పంటలు ఎండుతున్నాయని వారు అవేదన వ్యక్తం చేశారు. అన్నభాగ్య పథకం ద్వారా ఒక్కరికి 10కిలోల బియ్యం అన్నారని కాని కేంద్రం ఇచ్చే 5కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. గృహలక్ష్మీ పథకమని ఒక్క నెల మాత్రమే రూ. 2వేలు ఇచ్చారని పేర్కొన్నారు. యువనిధి పథకం ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని, మహిళలకు బస్సు ఫ్రీ అంటు పూర్తి స్థ్ధాయిలో అమలు చేయలేక ప్రభుత్వం చేతులేత్తేసినట్లు విమర్శించారు.

కాంగ్రెస్ చేతిలో మోసపోయం మీరు మోసపోకండి అంటూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌పై నిరసన తెలుపుతున్నారనే సమాచారం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు కర్నాటక రైతులను స్థానిక పోలీస్‌స్టేషన్ దగ్గర అడ్డుకున్నారు. దీంతో కర్నాటక రైతులకు కాంగ్రెస్ కార్యకర్తలకు తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా వారు వినిపించుకోకపోవటంతో అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ రహదారితోపాటు తహసీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు యూసుఫ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. కర్నాటక నుంచి వచ్చిన వారికి పోలీసులే భద్రత కల్పించి ర్యాలీకి సహకరించడం విడ్డురంగా ఉందని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన అధికార బీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోపోవడమే కాకుండా తమ కార్యకర్తలను ఆరెస్టు చేసినట్లు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News