వ్యాక్సిన్ల సరఫరాకు రెండు సంస్థల సంసిద్ధత
బెంగళూరు: రెండు కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన దరిమిలా రష్యాకు చెందిన స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. సోమవారంతో టెండర్ వేసే గడువు ముగిసిపోగా ముంబయికి చెందిన బల్క్ ఎంఆర్‌ఓ ఇండస్ట్రియల్ సప్లై ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన తులసి సిస్టమ్స్ బిడ్లు వేశాయి. ప్రధాన వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి ఎటువంటి బిడ్లు రాలేదని అధికార వర్గాలు తెలిపాయి.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు బల్క్ ఎంఆర్‌ఓ ఇండస్ట్రియల్ సప్లై ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాగా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ని కూడా సరఫరా చేస్తామని తులసి సిస్టమ్స్ సంసిద్ధత తెలిపింది. ఆర్థికపరమైన అంశాలతోపాటు ఇతర డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత వ్యాక్సిన్ ధర, ఇతర విషయాలపై సంప్రదింపుల ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అన్ని అంశాలను, నియమ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వ్యాక్సిన్ల కొనుగోలుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా..మరిన్ని బిడ్లు రావచ్చన్న ఆలోచనతో టెండర్ గడువు తేదీని పొడిగించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.