గడగ్: కర్నాటకలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇనుప రాడ్‌తో టీచర్ కొట్టిన దెబ్బలకు ఒక తొమ్మిదేళ్ల విద్యార్థి మరణించాడు. గడగఖలెపి పనర్గుండ్ సమీపంలోని హడలి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘోర సంఘటన శనివారం జరిగింది. నాలుగవ తరగతి చదువుతున్న భరత్ బరకేరి అనే విద్యార్థి ముట్టు హడలి అనే టీచర్ కొట్టిన దెబ్బలకు సోమవారం మరణించాడు. విద్యార్థిని కొట్టిన తర్వాత టీచర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
టీచర్ కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. తన కుమారుడిని ఎందుకు కొట్టావంటూ ప్రశ్నించిన భరత్ తల్లి గీతా బరకేరిపై కూడా ఆ టీచర్ చేయిచేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. భరత్ తన స్నేహితులతో మాట్లాడుతుండగా టీచర్ ఇనుప రాడ్‌తో కొట్టాడు. అదే స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్న తన తల్లి గీత దగ్గరకు భరత్ పరుగెత్తి టీచర్ కొట్టిన విషయం చెప్పాడు. ఎందుకు కొట్టావని గీత ప్రశ్నించగా ఆమెను కూడా నిందితుడు కొట్టాడని పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన భరత్‌ను హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా సోమవారం మరణించాడు. పోలీసులు టీచర్‌పై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.