Wednesday, January 22, 2025

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం తెలిపారు.

అమెరికాలోని వివిధ కంపెనీలతో చర్చలు జరిపి స్వదేశానికి తిరిగివచ్చిన ప్రియాంక్ ఖర్గే విలేకరులతో తన చర్చల వివరాలను వెల్లడించారు. పెట్టుబడులను ఆకట్టుకునేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ ఎంతో కీలకమని ఆయన అన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా యాపిల్.. వారు అడిగిన మొదటి ప్రశ్న ఉద్యోగార్హులను మీరు(రాష్ట్ర ప్రభుత్వం) సమకూర్చగలరా అని. కర్నాటకలో మినహాయించి మరెక్కడా ఇంతటి సామర్ధం ఉన్న మానవ వనరులు మీకు మరెక్కడా లభించవని వారికి (కంపెనీలకు) చెప్పాను.. అని ఖర్గే వివరించారు.

మానవ వనరులకు సంబంధించి కంపెనీలు అందచేసే సిలబస్ ఆధారంగా ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎఎండితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత్‌లోని 800 మంది ఇంజనీర్లను ఎఎండి నియమించుకుంటుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కిల్స్ సలహా కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటిఐలకు చెందిన విద్యార్థులను ఉద్యోగాలకు అర్హులయ్యే విధంగా వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇన్నోవేషన్‌లో కర్నాటక 18వ స్థానంలో ఉందని, రాష్ట్రాన్ని నంబర్ ఒన్‌గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ప్రియాంక్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News