Sunday, December 22, 2024

ఐఎఎస్ అధికారిణుల మధ్య వ్యక్తిగత ఫోటోల పంచాయితి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కన్నడనాట ఇద్దరు ఉన్నతాధికారిణులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది బసవరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆదివారం ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి చెందిన వ్యక్తిగత ఫొటోలను ఐపిఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలనే గతంలో రోహిణి పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని రూపా ఆరోపించారు. ఈ ప్రవర్తనతో వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. 2021 నుంచి 2022 మధ్య ఈ చిత్రాలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అలాగే అవినీతి ఆరోపణలూ చేశారు. దీనిపై తాను ముఖ్యమంత్రి బొమ్మై, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై రోహిణి అంతే ఘాటుగా స్పందించారు. రూపా(Roopa Moudgil) తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ’నా పరువుకు భంగం కలిగించేందుకు ఆమె నా సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్‌షాట్లను సేకరించారు. నేను వీటిని కొందరికి పంపినట్లు ఆమె అంటున్నారు. ఆ వ్యక్తులెవరో చెప్పాలని కోరుతున్నాను. మానసిక అనారోగ్యం అనేది పెద్ద సమస్య. వైద్యుల సహకారంతో దానిని తగ్గించాల్సిన అవసరం ఉంది. బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్నవారు ఆ అనారోగ్యం పాలైతే.. అది మరింత ప్రమాదకరం’ అని మండిపడ్డారు.

అలాగే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇద్దరు అధికారిణులు ఇలా బహిరంగంగా విమర్శలకు దిగడంపై కర్ణాటక ప్రభుత్వం గుర్రుగా ఉంది. ‘వారి ప్రవర్తనపై చర్యలు తీసుకుంటాం. ఇద్దరు సామాన్య వ్యక్తులు కూడా బహిరంగంగా ఇలా విమర్శించుకోరు. వారికి వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం ఉన్నా మీడియా ముందు ఇలా ప్రవర్తించడం సరికాదు’ అని కర్ణాటక హోంమంత్రి వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం, పోలీసు చీఫ్‌తో చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం రూప.. కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా సింధూరి విధులు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News