28 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
కేసు దర్యాప్తును సిబిఐకి బదలీ చేయాలని పిటిషన్
తదుపరి విచారణ 28న
బెంగళూరు : ముడా స్థలం కేటాయింపు కేసు దర్యాప్తును సిబిఐకి బదలీ చేయాలనే ఆదేశాన్ని కోరుతూ ఆర్‌టిఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన భార్యకు, ఇతరులకు కర్నాటక హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) సిద్ధరామయ్య భార్య పార్వతి బిఎంకు 14 స్థలాలు కేటాయించడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు.
సదరు కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల దర్యాప్తును సిబిఐకి బదలీ చేయాలనే పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఫిబ్రవరి 7న జారీ చేసిన ఉత్తర్వును అప్పీల్ సవాల్ చేస్తున్నది. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి అంజారియా, న్యాయమూర్తి కెవి అరవింద్‌తో కూడిన ధర్మాసనం నోటీసుకు ఈ నెల 28లోగా స్పందించాలని ఆదేశించారు. ‘ప్రతివాదులు 28 లోగా స్పందించేలా నోటీసు పంపాలి. సదరు వివాదానికి సంబంధించిన అప్పీళ్లను ఆ రోజు విచారణ చేయవలసి ఉందని పేర్కొన్నారు’ అని బెంచ్ తెలిపింది. అసలు పిటిషన్‌ను ఈ ఏడాది మొదట్లో తిరస్కరించారు. లోకాయుక్త దర్యాప్తు ఎటువంటి పక్షపాతాన్ని గాని, లోపాన్ని గాని ప్రదర్శించలేదని సింగిల్ జడ్జి తీర్పులో పేర్కొన్నారు.