Sunday, December 22, 2024

జయలలిత నగల అప్పగింతపై కర్నాటక హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జె జయలలితకు చెందిన బంగారు, వజ్రాల ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను మార్చి 26 వరకు నిలిపివేస్తూ కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది. జయలలిత మేనకోడలు జె దీప దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మొహమ్మద్ నవాజ్‌కు చెందిన సింగిల్ జడ్జి బెంచ్ మంగళవారం స్టే ఉత్తర్వులు జారీచేసింది. జయలలితపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ ఆభరణాలను ఆదాయం పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు వీటిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కావలసి ఉంది.

జయలలితపై న్యాయ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసినందున ఆమె ఈ కేసులో నిర్దోషిగా పరిగణించాలని పేర్కొంటూ 2023 జులై 12న ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దీప సవాలు చేశారు. జయలలిత, ఇతరులపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలుగా స్వాధీనం చేసుకున్న 27 కిలోల బంగారు, వజ్ర ఆభరణాలను మార్చి 6, 7వ తేదీలలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ప్రత్యేక కోర్టు తన ఉత్తర్వులలో ఆదేశించింది. జయయలలితకు విధించిన రూ. 100 కోట్ల జరిమానాను సేకరించడానికి ఈ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది.

వీటిలో 20 కిలోల బంగారు, వజ్ర ఆభరణాలను విక్రయించడం లేదా వేలం పాడడం చేయాలని, మిగిలిన 7 కిలోల ఆభరణాలను అవి వారసత్వంగా తల్లి నుంచి ఆమెకు అందాయని భావిస్తూ వాటిని మినహాయించాలని కోర్టు పేర్కొంది. ఈ బంగారాన్ని ఎలా అమ్మాలన్న విషయమై తమిళనాడు ప్రభుత్వం కార్యాచరణను రూపొందితుకోవచ్చని ప్రత్యేక కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్నాటకలో విచారణ జరిగినందున సాక్ష్యాధారాలన్నీ కర్నాటక ట్రెజరీలో కోర్టు అధీనంలో ఉన్నాయి. జయలలితతోపాటు ఆమె నెచ్చెలి వి శశికళ, జయలలిత వదులుకున్న పెంపెడు కుమారుడు విఎన్ సుధాకరన్, శశికళ వదిన జె ఇలవరసిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపి వారికి దాదాపు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News