Saturday, June 29, 2024

లీటరు పాలపై రూ. 2 పెంచేసిన కర్నాటక

- Advertisement -
- Advertisement -

బుధవారం నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నవన్న కెఎంఎఫ్

ఇది ‘ప్రజా వ్యతిరేకం’ అని విమర్శించిన బిజెపి

బెంగళూరు: కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) మంగళవారం లీటరు పాలకు రూ. 2 పెంచింది. అంతేకాదు ఇప్పుడున్న 500 మి.లీ , 1000 మి.లీ ప్యాకెట్లకు అదనంగా 50 మి.లీ వినియోగదారులకు ఇవ్వనున్నది. ఈ మార్పుతో నందినీ 550 మి.లీ టోన్డ్ మిల్క్(బ్లూ) రూ. 24, 1050 మి.లీ ప్యాకెట్ రూ. 44 కానున్నది.

ఏడాదిలో ఇలా పాల ధరను పెంచడం ఇది రెండోసారి. కాగా కొత్తగా పెంచిన ధరలు రేపటి నుంచి(బుధవారం) అమలులోకి రానున్నది. గతంలో 2023 జులైలో లీటరు పాలకు రూ. 3 పెంచారు. కాగా కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఇతర ఉత్పత్తులు అంటే పెరుగు తదితర పాల పదార్థాల ధరలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. స్టాకులో ఉన్న ప్యాకట్లపై ఉన్న రేట్లే వాటికి వర్తిస్తాయని, అవి అయిపోయాక వచ్చే కొత్త స్టాకు మీదే ధరల ప్రభావం ఉంటుందని కర్నాటక పాల సమాఖ్య తెలిపింది.

కర్నాటక పాల ధరలు ఇతర రాష్ట్రాలు… కేరళ, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తక్కువేనని కర్నాటక మిల్క్ ఫెడరేషన్ పేర్కొంది.

ఇదిలావుండగా కర్నాటకలోని ప్రతిపక్ష బిజెపి నాయకుడు ఆర్. అశోక్ స్పందిస్తూ ‘‘నందిని పాల ధరలను పెంచేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన 13 నెలలలోనే ఇలా పాల ధర పెంచడం ఇది రెండోసారి. గత ఆగస్టులో రూ. 3 లీటరుకు పెంచారు. ఇప్పుడు మళ్లీ లీటరుకు రూ. 2 పెంచారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గం వారు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధర పెంపుతో సతమతమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పుండు మీద ఉప్పు చల్లినట్టు పేద వారిపై పాల ధర రుద్దారు. మీకు పేద, మధ్య తరగతి వారిపై ఏమాత్రమైనా భావోద్వేగం ఉంటే వెంటనే పెంచిన ధర ఉత్తర్వును వెంటనే ఉపసంహరించండి’’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News