Thursday, January 23, 2025

కర్నాటక-‘మహా’ పేచీ

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్ళీ మంటలు చెలరేగాయి. బెలగావి (బెల్గాం) వద్ద కర్నాటకలోకి ప్రవేశించిన మహారాష్ట్రకు చెందిన ఆరు ట్రక్కులపై మంగళవారం నాడు కన్నడ రక్షణ వేదిక ఆందోళనకారులు దాడి చేశారు. అదే సమయంలో పూనే వద్ద నాలుగు కర్నాటక రాష్ట్ర రవాణా సంస్థ బస్సులపై శివసేన (యుబిటి) కార్యకర్తలు విరుచుకుపడ్డారు. చిరకాలంగా సుప్రీంకోర్టులో వున్న ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వివాదం త్వరలోనే విచారణకు వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో రెండు వైపుల గల ప్రాంతీయ సంఘాలు ప్రజలను రెచ్చగొట్టడం ప్రారంభించాయి.

రెండు రాష్ట్రాల్లోనూ బిజెపియే అధికారంలో వుంది. అయినా ఈ వివాదం ఈసారి ఇలా రగలకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించలేకపోయాయి. వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడానికి ఇద్దరు మహారాష్ట్ర మంత్రులు వస్తున్నారని తెలియడంతో కన్నడ ఆందోళనకారులు రెచ్చిపోయినట్టు వార్తలు చెబుతున్నాయి. బెలగావికి 24 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర వాహనాలపై రాళ్ళు విసరడంతో ఉద్రిక్తత నెలకొన్నది. కర్నాటకలో ప్రవేశించిన మహారాష్ట్ర వాహనాలపై ఈ దృశ్యాల వీడియో వైరల్ కావడంతో వాతావరణం వున్నట్టుండి వేడెక్కింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో ఫోన్‌లో మాట్లాడడం బిజెపి కేంద్ర నాయకత్వం కూడా జోక్యం చేసుకోడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు తెలుస్తున్నది.

karnataka maharashtra border dispute

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ కూడా తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లో హింసను అరికట్టాలని కర్నాటక ముఖ్యమంత్రికి అల్టిమేటమ్ ఇచ్చారు. పరిస్థితి ఆందోళనకరంగా వున్నదని చిరకాలంగా వేధిస్తున్న ఈ సమస్యపై స్పష్టమైన వైఖరి తీసుకోవలసిన సమయం వచ్చిందని పవార్ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్న ఈ వివాదం మూలాలు 1956 నాటి రాష్ట్రాల పునర్విభజనలో వుంది. ప్రజలు మాట్లాడే భాష ఆధారంగా ఏక భాషా ప్రాంతాలన్నింటినీ ఒకే రాష్ట్రంగా విభజించడానికి ఆనాటి భాషా ప్రయుక్త రాష్ట్రాల చట్టం ఆవిర్భవించింది. ఆ విభజన సమయంలో తమకు చెందాల్సిన 865 గ్రామాలు కర్నాటకలో కలిసిపోయాయని బెలగావి, నిపాని, కార్వార్ వంటి ప్రాంతాలు తమకు ఇవ్వాలని మహారాష్ట్ర డిమాండ్ చేయడం ప్రారంభించింది.

ఇందుకు కర్నాటక నిరాకరిస్తున్నది. మహారాష్ట్ర కోరుతున్న ప్రాంతాల్లో అటవీ వనరులు అధికంగా వున్న ఖానాపూర్, పొగాకు విశేషంగా పండే నిపాని వంటి సంపన్న భూభాగాలున్నాయి. ఇవన్నీ బెలగావికి ఆనుకొని వున్నందున ఆ ప్రాంతమంతటినీ తమకు ఇవ్వాలని మహారాష్ట్ర కోరుతున్నది. కేంద్రం 1966లో నియమించిన మెహర్ చంద్ మహాజన్ కమిషన్ 1967లో ఈ ప్రాంతాల్లో సవివరమైన సర్వే నిర్వహించి నివేదిక సమర్పించింది. కర్నాటకలోని 264 గ్రామాలు, పట్టణాలను మహారాష్ట్రకు అప్పగించాలని మహారాష్ట్రలోని 248 గ్రామాలను, పట్టణాలను కర్నాటకకు బదలాయించాలని అది సిఫారుసు చేసింది. అయితే బెలగావి మాత్రం కర్నాటకలోనే కొనసాగాలని చెప్పింది. ఈ సిఫారసులను రెండు రాష్ట్రాలూ తిరస్కరించాయి. బెలగావిని తనకు ఇచ్చి తీరాలని మహారాష్ట్ర పట్టుబడుతున్నది.

వివాదం రాజకీయ పరిష్కారానికి నోచుకోకపోడంతో కోర్టు దారి పట్టింది. 2004లో సుప్రీంకోర్టులో కేసు దాఖలయింది. మహారాష్ట్ర వైపు మహారాష్ట్ర ఏకీకరణ సమితి, కర్నాటక వైపు కర్నాటక రక్షణ వేదిక ఈ వివాదాన్ని తరచూ రాజేస్తున్నాయి. వాస్తవానికి భాషాపరంగా రాష్ట్రాల విభజన కాల పరీక్షకు నిలబడలేదని చెప్పవచ్చు. విఫల ప్రయోగాలను పునః పరిశీలించి లోపాలను సరిచేయవలసిన బాధ్యత రాజకీయ నాయకత్వంపై వుంటుంది. కోర్టుల తీర్పులు భావోద్వేగాలు ప్రేరేపించే శక్తులను నిరోధించలేవు. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకత్వాలు న్యాయమైన పరిష్కారానికి అంగీకరిస్తే తాము రాజీపడిపోయామనే అపనిందకు గురి కావలసి వస్తుందని భయపడడం సహజం.

దేశాల మధ్య సరిహద్దు వివాదాలైనా, రాష్ట్రాల మధ్య పేచీలైనా ఎప్పటికీ పరిష్కారానికి నోచుకోకుండా రగులుతూ వుండడానికి ప్రధాన కారణం ఇదే. సుప్రీంకోర్టులో కేసు ఎటువంటి మలుపు తిరిగినప్పటికీ అంత వరకు వేచి వుండకుండా వివాదాన్ని పరిష్కరించుకోగలిగితే విజ్ఞతాయుతంగా వుంటుంది. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో వుండడం ఇందుకు దోహదపడే సానుకూల అంశం. దీనిని ఉపయోగించుకోడం ద్వారా పరిణత రాజకీయ సారథులం అనిపించుకోవలసిన బాధ్యత బిజెపి నాయకత్వంపై వుంది. సమీప భవిష్యత్తులో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఈ వివాదం వేడి చల్లారకపోయే ప్రమాదమే కనిపిస్తున్నది. ఈ ఘర్షణలకు సామాన్య ప్రజానీకం జీవన భద్రత, ప్రశాంతత బలి కాకూడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News