బెంగళూరు: భార్య మృతదేహాన్ని స్మశానానికి వాహనంలో తరలించేందుకు డబ్బులు లేక ఒక నిరుపేద వ్యక్తి ఆమె శవాన్ని గోనె సంచిలో చుట్టి భుజంపై వేసుకుని నడుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన కర్నాటకలోని చామరాజనగర్ జిల్లా యలందూర్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రవి, కళమ్మ భార్యాభర్తలు. రెండు వారాల క్రితం వీరిద్దరూ యలందూరు పట్టణానికి వచ్చారు.
అటవీ శాఖ భవనం సమీపంలో తలదాచుకున్న వీరు అక్కడే పాత ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి కళమ్మ అనారోగ్యంతో మరణించింది. ఆమె మృతదేహాన్ని తరలించేందుకు రవి దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆమె మృతదేహాన్ని గోనె సంచీలో కట్టి భుజాన వేసుకుని సమీపంలోని సువర్ణవతి నది ఒడ్డున ఖననం చేసేందుకు నడక సాగించాడు.
దారిలో పోలీసులకు అనుమానం వచ్చి గోనె సంచి విప్పి చూడగా కళమ్మ మృతదేహం కనిపించింది. కళమ్మ మృతికి కచ్ఛితమైన కారణమేమిటో నిర్ధారించడానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రవిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేయడంతోపాటు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.