Monday, December 23, 2024

కర్నాటక మంత్రి అవినీతి

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession అధికారం, దురాశ, డబ్బు వున్న చోట అవినీతి తప్పనిసరిగా వుంటుందని అనుభవజ్ఞులు చెప్పిన మాట పొల్లుపోకుండా రుజువవుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని వేయి విధాలుగా వేలెత్తి చూపి దానిని అధికారం నుంచి సాగనంపినవారు బిజెపి పాలనలోని అవినీతిని గురించి ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడకపోడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తన చేతిలో వున్న సిబిఐ, ఇడి, ఐటి తదితర ఆర్థిక నిఘా సంస్థలను బిజెపియేతర ప్రభుత్వాల్లోని వారిపైనే ప్రయోగించడం, బిజెపి ప్రముఖులను వదిలివేయడం గత ఎనిమిదేళ్లుగా కనిపిస్తున్న కఠోర సత్యమే. కర్నాటకలోని బిజెపి ప్రభుత్వ మంత్రి ఒకరు ఒక ప్రాజెక్టు విషయంలో ఒక యువ కాంట్రాక్ట్ వద్ద నుంచి 40 శాతం కమిషన్ అడగగా ఆ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కమలనాథుల తాజా బండారాన్ని బయటపెట్టింది.

ఈ విషయం కర్నాటకను కుదిపేయడం చివరికి మొఖం చెల్లక మంత్రి చేత రాజీనామా చేయించడానికి బిజెపి అగ్రనాయకత్వం నిర్ణయించుకోడం కోడలికి సుద్దులు చెప్పి తెడ్డు నాకిందని చెప్పుకునే అత్త సామెతను గుర్తు చేస్తున్నది. రాజకీయ అవినీతి గురించి తెలియనివారుండరు. దానిపై సాగిన, సాగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. కొన్ని ఉదంతాలు, పరమ పవిత్రులని, సంసారమే లేని వ్యక్తులకు అవినీతితో పనేముందని చెప్పుకునే గొప్పల గాలి తీసివేస్తాయి. ఎదురులేని, తిరుగులేని అధికారాన్ని ఉపయోగించి కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెట్టడం ద్వారా తన పార్టీకి, తన అధికారానికి ఢోకాలేని పరిస్థితిని సాధించుకోడం అవినీతి కిందికి రాదా? అనే ప్రశ్న తలెత్తితే అందుకు ఆక్షేపించలేము. అందుచేత అవినీతి అవతారాలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు. మంత్రులు ప్రాజెక్టులను మంజూరు చేయడంలోనో, కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడో, లంచాలకు మంచం వేయడం సర్వసాధారణమని అనుకోడం సహజం.

కాని కర్నాటకలో అది ప్రత్యక్షంగా రుజువైంది. ఆ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ మంత్రి ఈశ్వరప్ప, ఆయన సహచరులిద్దరిపై ఉడుపి పోలీసులు బుధవారం నాడు అవినీతి కేసును నమోదు చేశారు. తన మరణానికి మంత్రి ఈశ్వరప్పే బాధ్యుడని వాట్సాప్ సందేశాన్ని తన స్నేహితులకు పంపించి సంతోష్ కె పాటిల్ అనే సివిల్ కాంట్రాక్టర్, బిజెపి కార్యకర్త ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై గత్యంతరం లేక ఈ కేసును నమోదు చేసినట్టు తెలుస్తున్నది. దీనితో కర్నాటక ప్రతిపక్ష కాంగ్రెస్ మంత్రి రాజీనామాను కోరుతూ ఉద్యమం చేపట్టింది. మంత్రిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేయనున్నట్టు హెచ్చరించింది.

రాజీనామా చేసే ప్రసక్తే లేదని మొదట్లో మొండితనం ప్రదర్శించిన మంత్రి చివరికి అందుకు సిద్ధపడ్డారని సమాచారం. అంటే బిజెపి కేంద్ర నాయకత్వం కలుగజేసుకొని మంత్రిని రాజీనామాకు సిద్ధం చేసినట్టు బోధపడుతున్నది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప అవినీతి ఊబిలో తలమునకలై న్యాయస్థానం వేలెత్తి చూపించిన తర్వాత పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అవినీతి కర్నాటక ఖజానాకు 3 బిలియన్ డాలర్ల పైచిలుకు నష్టాన్ని కలిగించిందని అవినీతి నిరోధక శాఖ తన నివేదికలో ఆరోపించింది. ఆ రాష్ట్రంలో చిరకాలంగా సాగుతూ వచ్చిన అక్రమ గని తవ్వకాల ఉదంతాలు తెలిసినవే. రాజకీయ స్థాయి వెన్నుదన్ను లేకుండా అటువంటివి జరగడం కష్టసాధ్యం. బళ్లారికి చెందిన గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ ఇనుము తవ్వకం కేసు జగమెరిగినదే. కర్నాటకలో బిజెపికి వెన్నుదన్నుగా వుండి అది అధికారంలోకి రావడంలో తోడ్పడిన చరిత్ర జనార్ధన్ రెడ్డికి, ఆయన అనుచరులకు వుందనేదీ వాస్తవమే. నైతిక జీవనం, ధర్మం గురించి నీతులు చెప్పే బిజెపి నౌకకు గల రంధ్రాలు ఇంతగా, ఒకటొకటిగా బయటపడుతున్నా దాని అధికారానికి ఎటువంటి హాని కలగకపోడం వెనుక ఈ దేశ ప్రజల అమాయకత్వం, అజ్ఞానమే వున్నాయి.

అవి తొలగనంత వరకు ఇటువంటి కుంభకోణాలు బయటపడుతూనే వుంటాయి. బిజెపి అగ్రనేతలు చేతులు దులుపుకుంటూ అన్యుల మీద ఆరోపణలు చేసుకుంటూ నిష్పూచీగా అధికార అందలంలో ఊరేగుతూనే వుంటారు. అన్నా హజారే నాయకత్వంలో యుపిఎ అవినీతిపై ఢిల్లీని హోరెత్తించి దేశమంతటినీ ప్రభావితం చేసిన ఉద్యమం తెలిసిందే. ఆ ఉద్యమం డిమాండ్ చేసిన లోక్‌పాల్ వ్యవస్థ ఇప్పటికీ రూపుదిద్దుకోకపోడం రాజకీయ అవినీతి నిర్మూలన పట్ల బిజెపి పాలకులకు గల నిజాయితీ ఎంతో చాటిచెబుతున్నది. ఎలెక్టోరల్ బాండ్స్ పథకం ద్వారా వచ్చిన నిధుల్లో 94.5 శాతం బిజెపి వద్దనే వున్నట్టు వెల్లడైంది. దీనిని బట్టి దేశంలో రాజకీయ అవినీతి ఎంతగా పేట్రేగిపోతున్నదో తెలుస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News