Thursday, January 23, 2025

కర్నాటకలో ఎస్‌టి సంక్షేమ శాఖలో రూ 187 కోట్ల స్కామ్

- Advertisement -
- Advertisement -

కర్నాటక ఎస్‌టి సంక్షేమ విభాగంలో రూ 187 కోట్ల మేర దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని ఈ విభాగంలో స్కామ్ సంబంధిత వ్యవహారంలో ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం వంటి పరిణామాలపై హోం మంత్రి జి పరమేశ్వర స్పందించారు. ఈ వ్యవహారంపై సిఐడి దర్యాప్తు జరుగుతోందన్నారు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందనేదానిపై అనేక రకాల వార్తలు వెలువడుతున్నాయి. పైగా పలు ఐటి కంపెనీల ఖాతాలలోకి డబ్బులు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహరంలో రాష్ట్ర ఎస్‌టి సంక్షేమ మంత్రి బి నాగేంద్ర రాజీనామాకు బిజెపి పట్టుబడుతోంది. ప్రతి విషయానికి మంత్రుల రాజీనామాలకు బిజెపి డిమాండ్‌కు దిగడం వారి తంతు అయిందని హోం మంత్రి విమర్శించారు.

దర్యాప్తు చేపట్టామని, నిజాలు తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, దీనిపై తొందరెందుకు? అని ప్రశ్నించారు. నిధులు మళ్లించాలని మంత్రి మౌఖిక ఆదేశాలు వెలువరించారని, ఈ మేరకు తరువాతి క్రమంలో జరిగిన పరిణామాలలో ఓ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై మంత్రి స్పందించారు. ఏది ఏ విధంగా జరిగిందనేది దర్యాప్తుతోనే స్పష్టం అవుతుందని తేల్చిచెప్పారు. వెనుకటికి బిజెపి అధికారంలో ఉండగా ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన దశలో అప్పటి మంత్రి కెఎస్ ఈశ్వరప్ప రాజీనామాకు కాంగ్రెస్ పట్టుపట్టిందనే అంశాన్ని మీడియా ప్రస్తావించింది. అయితే ఈ కేసుకు ఆ కేసుకు పోలిక లేదని, అప్పట్లో ఆ వ్యవహారంలో మంత్రి పేరు కేసులో ఉందని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News