బెంగళూరు: దళితులతో సహా అన్ని కులాల వారు కూడా తమ కులానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నాయని, అయితే దీనిపై నిర్ణయం తీసుకోవలసింది కాంగ్రెస్ హైకమాండేనని కర్నాటక మంత్రి సతీశ్ జార్కిహోళి సోమవారం అన్నారు. జార్కిహోళిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామని తన కులానికి చెందిన వారు చేసిన ప్రకటనపై బోయ కులానికి చెందిన నాయకుడైన ఆయన తేలిగ్గా కొట్టి పారేశారు. ‘ఇది పాత సమస్య అని, గతంలో కూడా ఇలాంటి డిమాండ్‌ను వివిధ కార్యక్రమాలు, వేదికలపై చేశారని ఆయన అన్నారు. ఇది పాత అంశం. 2013లో కూడా దళిత సిఎం డిమాండ్‌ను లేవనెత్తారు.
అయిదేళ్ల కాలంలో అది చాలా రోజులు నడిచింది కూడా. అయితే సినిమా రిలీజ్ కాలేదు. అదీ పరిస్థితి’ అని కాంగ్రెస్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన జార్కిహోళి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందని అడగ్గా, వేచి చూడాలి. 2008లో కూడా మల్లికార్జున ఖర్గే ప్రధాన పోటీదారుగా దళిత ముఖ్యమంత్రి డిమాండ్ వచ్చింది. అయితే ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు జి పరమేశ్వర( ప్రస్తుత హోంమంత్రి) ఎనిమిదేళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయినా ఆయనకు కూడా ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ రాలేదు’ అని జార్కొహోళి అన్నారు.