Wednesday, January 22, 2025

దక్షిణాది దర్వాజ బంద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/బెంగళూరు:కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ లేదా హంగ్ వస్తుందనే అంచనాలను కూడా కాదంటూ బిజెపి కేవలం 70స్థానాల్లోపు పార్టీగానే మారి, ప్రధానమైన దక్షిణాది రాష్ట్రం కర్నాటకను చేజార్చుకుంది. దీనితో బిజెపికి ఇప్పటికైతే దక్షిణాది ముఖద్వారం బంద్ అయింది. క ర్నాటకలో బిజెపి స్థానాల సంఖ్య ఇంతకు ముందటి 104 నుంచి కేవలం 64కు దిగజారడంతో దక్షిణాదిలో బిజెపి గాలి ఉండటం కాదు గాలితీసినట్ల అయింది. ఇక ఇక్కడ ఫలితాలతో బెంగళూరు నుంచి బికనీరు వరకూ , రాంచీ నుంచి అహ్మదాబాద్ వరకూ కాంగ్రెస్ శిబిరాలలో ఉత్సాహం వెల్లివిరిసింది. రాహుల్‌ను ఉత్తరాది నుంచి దక్షిణాదికి వెలివేసే చర్యలు, తరువాతి క్రమంలో మోడీ వల్లనే ఆయన ఎంపి సీటుకు ఎసరు వచ్చిపడిందనే భావన తలెత్తడం వంటి పరిణామాలతో ఇప్పుడు దక్షిణాదిలో బిజెపి గడపదాటలేని స్థితిని తెచ్చుకుంది.

కర్నాటకలో ఇప్పుడు నఫ్రత్‌కే బజార్ మూత, మెహబ్బత్ కి దుకాణే తెరిచివేత పరిణామం జరిగిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇప్పటి కర్నాటక ఎన్నికల ఫలితాలతో దక్షిణాదిలో ఐదురాష్ట్రాలలో ఎక్కడా బిజెపి అధికారం లేని పా ర్టీగా మారింది. కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరిలో బిజెపి కూటమితో అధికారంలో ఉంది. దక్షిణాదిలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో, కేరళలో, తమిళనాడులో, ఇప్పు డుకర్నాటకలో కూడా బిజెపి అధికారం లేకుండాపోయిం ది. తమిళనాడులో బిజెపి ఎంట్రెన్స్ గగనకమల కుసు మం అవుతోంది. అన్నాడిఎంకెతో కూటమిగా దిగి గత ఎన్నికలలో బిజెపి నలుగురు ఎమ్మెల్యేలను పొందింది. కేరళ అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలు లేరు. మతవాద రాజకీయాలను ఎప్పుడూ ఆదరించని తెలంగాణలో బిజెపి ఇప్పటి హంగామాకు కర్నాటక ఫలితం కటిక చేదునిజం అయింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి సొంత బలం కొంత మేరకైనా కనపడని స్థితి ఉండటంతో జాతీయ పార్టీ హోదాలో ప్రముఖ పార్టీ అయిన బిజెపి ఇప్పుడు ఉత్తర భారతంలో అయోధ్య , ప్రయాగ్‌రాజ్‌లకు పరిమిత పార్టీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్య సరికొత్త రామాలయ ప్రారంభోత్సవం ఈ ఏడాది చివరిలో అంతకు ముందు నూతన పార్లమెంట్ భవన ఆవిష్కరణ, అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా అం దివచ్చే పరిణామాలు జరుగుతాయా? అని వేచి చూడ టం తప్పితే బిజెపి దేశ ప్రజల నిత్యావసర సమస్య పరిష్కారం విషయంతో తాము ముందున్నామనే చాటింపులకు ఏ కోశానా దిగలేని స్థితిలో ఉంది. జి 20 సదస్సుకు భారత్ సారధ్యం, ముగిసిన కోవిడ్ టీకాల ఉత్పత్తిలో భా రత్ ఘనత వంటి విషయాలను పెద్దగా చిత్రీకరించుకుని జాతీయ స్థాయిలో ఓటర్ల నాడిని తమ వైపు మల్చుకోవాలనే తపనకు జనం స్పందన సార్వత్రికంగా ఏ విధంగా ఉంటుందనేది వచ్చే ఏడాది తీర్పుతో స్పష్టం కానుంది.

విస్తరణ కాంక్షలు ఆవిరి?
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాలలో నయాసిల్‌సిలా ఆరంభం అవుతోందా? ఇక్కడ కాం గ్రెస్ ఇతరుల మద్ధతు లేకుండా ఒంటరిగా ప్రభుత్వ స్థాప న మెజార్టీ సాధించడం కీలక జాతీయ పరిణామం అ యింది. ఇప్పుడు మోడీ భావిస్తూ వస్తున్న ఘనమైన బిజె పి దక్షిణాదిలో వేళ్లూనుకునే స్థితి లేని దుస్థితితో పడింది. దక్షిణాదిలో ఇప్పుడు బిజెపి అధికారం నామ్ నిషాన్ లేకుండా పోయింది. ఉన్న ఒక్క కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోడీ తన విశేష ప్రచారానికి వచ్చి, సాగించింది కేవలం అట్టహాసం మిగిల్చి వెళ్లినట్లు అయింది.

కర్నాటను చేజార్చుకున్న తరువాత బిజెపి ఇప్పుడు కేవలం దక్షిణాది విజయం విషయంలో కేవలం ఉత్తర ప్రగాల్భాలాలకే పరిమితం అయ్యి, ఉత్తర పార్టీగానే తన ఉనికిని చాటుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రాబల్యం తప్ప ఇప్పుడు ఈ పార్టీ సొంతంగా తెలియచేసుకునే బలం లోక్‌సభలో తిరుగులేని మెజార్టీతో ఉండటమే. మధ్యప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలు, ఇప్పుడు చేజార్చుకున్న కర్నాటకలో ఈ పార్టీ కేవలం ఫిరాయింపుల పర్వపు గోడమీది పిల్లులైన గోపిలతోనే దొడ్డిదారి అధికారంలోకి వచ్చింది. గవర్నర్ల వ్యవస్థను తనకు అనుకూలంగా మల్చుకుని తన వ్యక్తులను సిఎం సీట్లో కూర్చోబెట్టే క్రమంలో బిజెపి నానా యాగీ చేసిందనే విషయం ఇటీవల మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టు సుదీర్ఘ వివరణల తీర్పుతో స్పష్టం అయింది.

ఉద్ధవ్ థాకరే చెపుతున్నట్లు దేశంలో నెలకొన్న నంగానాచ్ వంటి వికృత రాజకీయ పరిణామాలకు బాధ్యులు ఎవరు అనేది జనం తేల్చుకునే దశ ఏర్పడింది. కర్నాటక ఎన్నికలకు అత్యంత తీవ్రస్థాయి హైప్‌ను తీసుకువచ్చింది కేవలం ప్రధాని మోడీనే. ఇక్కడ ప్రతి సభలోనూ ఆయన కాంగ్రెస్‌ను తరాల కథలను తీసుకుని దునుమాడారు. తమ పార్టీకి కాంగ్రెస్ ప్రధాన శత్రువు కాబట్టి ఇక జనం అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయాలని ఆదేశించినంత పనిచేశారు. ఎప్పుడైతే కన్నడిగులు కానీ ఇతరులు కానీ తమకు తమ అంతరాత్మలకు ఇతరుల నుంచి శాసింపులు వెలువడుతాయో అప్పుడు ప్రజాస్వామికంగా మౌనంగానే తమ ఓటు హక్కుతో తగు జవాబు వెలువరిస్తారనే విషయం ఇప్పుడు ఇక్కడి ఎన్నికల బ్యాలెట్‌తో రుజువు అయింది. పలు కారణాలతో దక్షిణాదిలో పలు రాష్ట్రాలలో కనీస ఉనికిని కూడా చాటుకోలేని రీతిలో ఉన్న బిజెపి తమిళనాడు, కేరళ ఇతర దక్షిణాది రాష్ట్రాలపై తన పగటికలలను గట్టున తీసి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పట్టాలు తప్పిన డబుల్ ఇంజిన్ సర్కారు
2013 తరువాత 2014 ఈ రెండూ భారతదేశానికి ఎన్నికల కాలంగా నిలిచింది. కర్నాటక తరువాత ఈ ఏడాది మధ్యలోనే జరిగే మధ్యప్రదేశ్, ఆ తరువాతి రాజస్థాన్ ఎన్నికలు ఆ తరువాతి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కర్నాటక ఫలితం పలు విధాలుగా పడేందుకు రంగం సిద్ధం అయింది. కర్నాటకలో కానీ ఇతరత్రా కానీ కేంద్రంలోని అధికార బిజెపి పట్ల ఉన్న వ్యతిరేక భావనలు ఇప్పటివరకూ కేవలం ఆయా నేలల్లో అంతర్గతంగా మొలవని రీతిలో నిలిచి ఉన్నాయి. ఎన్నికల చినుకుపడితే చాలు ఇవి వాటంతట అవే తన్నుకువచ్చి బిజెపి వ్యతిరేక ఫలాలను చాటుతాయనే విషయం కర్నాటక నిజంతో వెల్లడైంది. కర్నాటకలో కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకురాలు సోనియా గాంధీ కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలోనే సభలలో ప్రసంగించారు. ఇక రాహుల్ ప్రధాన కూడళ్లకు బదులు, పక్కదారులలో అంటే స్కూటర్ వెనుక సవారీలు, చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే సముదాయాలకు దిగడం, ప్రియాంక దోశెలు ట్రై చేయడం వంటివి జరిగాయి తప్పితే తమకు తాము ఈ ఎన్నికలను పార్టీకి హై రిస్క్ రింగ్‌లోకి జార్చలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News