మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా ) కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సతీమణి పార్వతితోపాటు, మరో ఇద్దరికి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య, అతడి సతీమణి, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముడా అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండడంతో పోలీస్‌లు మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని బీజేపీ చేసిన ఆరోపణల నేపథ్యంలో తాజా ఫిర్యాదు ప్రాముఖ్యత సంతరించుకుంంది. అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి సతీమణి పార్వతి పేరిట పంపిణీ చేసిన ప్రత్యామ్నాయ స్థలాల విలువ అసలు భూముల విలువ కంటే ఎక్కువగా ఉందన్న కారణమే.
ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఈ ఆరోపణను ఖండించారు. 1998లో పార్వతి సోదరుడు మల్లికార్జున ఆమెకు ఆ భూమిని ఇచ్చారని సిద్ధ రామయ్య చెప్పే మాటలు నిజం కాదని, దానిని ఆమె సోదరుడు 2004 లో కొనుగోలు చేసి 2010లో పార్వతికి బహుమతిగా ఇచ్చారని కార్యకర్త ఆరోపించారు. దానిని వ్యవసాయ భూమి అని తప్పుడు రికార్డులు సృష్టించారన్నారు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాత్రమే కాదు, ముడా పరిధిలో రూ. 4 వేల కోట్ల విలువైన అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ ఆరోపించారు. ఇందులో జరిగిన అక్రమాల నిగ్గు తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.