బెంగళూరు: కర్నాటక ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్ ఈ ఇద్దరిలో ఎవరూ అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ (113) అందుకోకపోతే ఏంటీ పరిస్థితి అన్నది ఇప్పు డు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జెడిఎస్ నేతలు, మాజీ ప్రధాని దేవెగౌడ్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అనుసరించే రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుందన్నదానిపై అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. మెజారిటీ సీట్లు గెలుచుకుని తామే అధి కారాన్ని హస్తగతం చేసుకుంటామని జెడిఎస్ చెబుతున్నప్పటికీ ఎ గ్జిట్‌పోల్స్ అంచనాలు అందుకు ఏ మాత్రం దగ్గర్లో లేకపోవడం ఆలోచించదగ్గ విషయం. బిజెపి, కాంగ్రెస్‌లో మెజారిటీ సీట్లు ఎవ రూ గెలువకపోతే ప్రభుత్వ ఏర్పాటులో జనతాదళ్(ఎస్) మద్దతు కీలకం. జెడి(ఎస్) కింగ్‌మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి ఎంఎల్‌ఏలకు ఎరవేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
కాగా తన ఎంఎల్‌ఏలను గుప్పిట్లో పెట్టుకోడానికి జెడి(ఎస్) కూడా సిద్ధమైంది. మరోవైపు కాంగ్రెస్ ముందుజాగ్రత్తగా అభ్యర్థులందరినీ బెంగళూరు రావాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు మాజీ ప్రధాని హెచ్.డి.దేవె గౌడ వ్యక్తిగతంగా అన్ని చూసుకుంటున్నారు. కుమారస్వామి ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచే పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. శనివారంనాడు ఉదయానికల్లా ఆయన బెంగళూరు చేరుకుంటారని సమాచారం. కర్నాటకలో కన్నా సింగపూర్ నుంచే బేరసారాలు చేయడానికి అనుకూలంగా ఉంటుందన్న ఆలోచన కుమారస్వామికి ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బిజెపి, కాంగ్రెస్ కూడా ఇప్పటికే కుమారస్వామితో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి.
మద్దతుపై జెడిఎస్ ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆ పార్టీ సీనియర్ నేత తన్వీర్ ఆహ్మద్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తమ నాయకుడు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, సరైన సమయంలో దానిని వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. రెండు పార్టీలు తమను సంప్రదిస్తున్నాయని తేల్చేశారు.
2019 పునరావృతమయ్యేనా..?
2019లో బిజెపి కాంగ్రెస్, జెడి(ఎస్) నుంచి 17 ఎంఎల్‌ఏలను తనవైపుకు లాక్కుంది. దీని దృష్టా కాంగ్రెస్ సీట్లు తక్కువ అయితే ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తోంది. దానికో దూకుడు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. దేవె గౌడ, కుమార స్వామి తమ పార్టీ అభ్యర్థులతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ నుంచి వచ్చి జెడి(ఎస్) టికెట్‌పై పోటీచేసిన అభ్యర్థులతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. అలాంటి వారిపై జెడిఎస్ వర్గాలు నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తోంది.