బెంగళూరు: ఈసారి కర్నాటక ఎన్నికలలో లింగాయత్‌ల ఓట్లు కాంగ్రెస్‌కు కలిసివచ్చాయి. రాష్ట్రంలో లింగాయత్‌లు 17 శాతం వరకూ ఉన్నారు. ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే లింగాయత్‌లకు బిజెపి పట్ల అసంతృప్తి రేకెత్తింది. అయితే ఎన్నికల దశలో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు బిజెపి విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో దాదాపు 87 స్థానాలలో లింగాయత్ ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నాయి. వీటిలో అత్యధికం ఇప్పుడు కాంగ్రెస్ వైపు పడటం వల్ల పార్టీ సొంతంగానే అధికారంలోకి వచ్చే స్థితికి చేరింది. బిజెపికి ఇంతకాలం లింగాయత్ బలం ఆయువుపట్టుగా ఉంటూ వచ్చింది. బిఎస్ యడ్యూరప్ప, సిఎం బస్వరాజు బొమ్మైలు ఈ వర్గానికి చెందిన వారే. బిజెపి హయాంలో లింగాయత్‌కు సరైన ప్రయోజనాలు దక్కకపోవడం పార్టీ పట్ల విరక్తికి దారితీసింది.
యడ్యూరప్ప బదులు ఇదే వర్గానికి చెందిన బస్వరాజును సిఎం స్థానంలో కూర్చోబెట్టినా జరిగిన నష్టం పూడ్చలేనిదిగా మారింది. పైగా ఈ వర్గానికి చెందిన ప్రముఖ నేత జగదీష్‌షెట్టార్ ఎన్నికల దశలో కాంగ్రెస్‌లో చేరడం కూడా ఈ పార్టీకి కలిసి వచ్చింది. లింగాయత్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని షెట్టార్ నమ్మబలికారు. ఇదే దశలో యడ్యూరప్పకు బిజెపి తీరని అన్యాయం చేసిందనే విషయం ఈ వర్గంలో బలంగా నాటుకుపోవడం కూడా కీలక పరిణామానికి దారితీసింది. అయితే లింగాయత్‌లు తమ పార్టీవైపే ఉన్నారని, ఈ మఠాల స్వామిల ఆశీస్సులు కూడా దక్కాయని వారు తమతో కలిసి వస్తారని యడ్యూరప్ప పదేపదే చెప్పినా ఫలితం లేదని ఎన్నికల ఫలితాలతో వెల్లడైంది.