Monday, December 23, 2024

గొంతు నులిమి చంపేశామని గుంతలో పడేశారు… యోగాతో ప్రాణం నిలుపుకుంది

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ యువతికి ప్రియుడితో మనస్పర్థలు రావడంతో ఆమెను గొంతు నులిమి చంపేశారు. అనంతరం గుంతలో పడేసి వెళ్లిపోయారు. శ్వాసను నియంత్రించి చనిపోయినట్టు నటించి నిందితులు వెళ్లిపోయిన తరువాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా దిబ్బూరహళ్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేహనహళ్లి ప్రాంతంలో ఓ యువతి(34) యోగా టీచర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది. సంతోష్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి మనస్పర్థలు రావడంతో అతడిని ఆమె దూరంగా పెట్టింది. దీంతో ఆమెపై అతడు కక్ష పెంచుకున్నాడు. ఆమె దగ్గర యోగా నేర్చుకుంటున్న సతీష్ రెడ్డిని యువతిని చంపేందుకు సంతోష్ రెడ్డి సాయం కోరాడు.

సతీష్ రెడ్డి కూడా ఓ ప్రైవేటు డిటెక్టివ్‌ఎజెన్సీని నిర్వహిస్తున్నాడు. సతీష్ రెడ్డి తన అనుచరులు రమణ, రవి, సల్మాన్లతో పాటు సంతోష్ కలిసి ఆమెను కిడ్నాప్ చేశారు. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులమడంతో కిందపడిపోయింది. ఆమె చనిపోయిందని గ్రహించిన నిందితులు ఓ గుంతలో యువతిని పడేశారు. వాళ్లు గొంతు నులుముతుండగా యువతి శ్వాసను నియంత్రించుకొని మృతి చెందినట్లు నటించింది. వాళ్లు వెళ్లిపోయిన తరువాత గుంతలో నుంచి బయటకు లేచి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సంతోష్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్‌పి కుశాల్ చౌక్సే తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News