Wednesday, January 22, 2025

ఆల్మట్టి టు ‘అప్పర్‌భద్ర’

- Advertisement -
- Advertisement -

Karnataka water exploitation

కర్నాటక జల చాకచక్యాన్ని ఏమని వర్ణించగలం!

రాష్ట్రంలో, కేంద్రంలో
ఎవరెవరున్నా కర్నాటక
నాయకుల ఎత్తుగడల
ముందు చిత్తే! జల దోపిడీ
విషయంలో రాష్ట్రంలోని
పార్టీలన్నీ ఒక్క మాటమీదనే
లాబీయింగ్‌నే నమ్ముకొన్న
కర్ణాటక వత్తాసు
పలుకుతున్న కేంద్రం
ట్రిబ్యునల్ అవార్డు, కోర్టు
తీర్పులు బేఖాతరు ఆల్మట్టి
డ్యాం ఎత్తు 524 మీటర్లకు
పెంపు ప్రేక్షక పాత్రలో కేంద్ర
జల సంఘం తెలంగాణకు
తీరని అన్యాయం

మన తెలంగాణ / హైదరాబాద్: కృష్ణానది జలాల కర్ణాటక ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాటగా యధేచ్ఛగా కొనసాగుతోంది. ట్రిబ్యునల్ తీర్పులను పట్టించుకోకుండా, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ నదుల నీటిని వినియోగించుకునే విషయంలో అన్ని పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి లాబీయింగ్ చేస్తుంటారని, అదే కర్ణాటక సక్సెస్ (నదుల నీళ్ల విషయంలో)కు ప్రధాన కారణమని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖలోని కొందరు సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన నేతలు మొదట్లోనే కర్ణాటక జల అడ్డుకట్ట వేయకపోవడంతో రాష్ట్రం పెట్రేగిపోతోందని ఆ అధికారులు వివరించారు. కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి చుక్కనీరు కూడా దిగువన ఉన్న తెలంగాణకు రాకుండా అడ్డుకట్టలు వేయడంలో కర్ణాటక ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని నీటిపారుదల శాఖకు చెందిన సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. ఇరవై ఏళ్ళుగా నదుల నీటిని కబళించడానికి కర్ణాటక వేస్తున్న ఎత్తులు, జిత్తులు మొత్తం ఫలించాయని ఆ అధికారులు అంటున్నారు.

తాజాగా అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉపక్రమించిన కర్ణాటక ప్రభుత్వం ఎలాగైనా ప్రాజెక్టులను నిర్మించి తీరుతుందని కర్ణాటక గత చరిత్ర తెలిసిన ఆ అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే కర్ణాటక గత చరిత్ర మొత్తం కృష్ణానది, తుంగభద్ర, కావేరి వంటి పెద్ద నదులే కాకుండా ఉప నదుల నీటిని కూడా దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చుక్కనీరు కూడా వెళ్ళకుండా ఒడిసిపట్టుకొంటూ జాతీయస్థాయిలో కర్ణాటక ప్రభుత్వ మొండివైఖరిని బహిర్గతం చేసుకొందని ఆ అధికారులు అంటున్నారు. అప్పర్ తుంగ ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీల నీటిని, అప్పర్ భధ్ర ప్రాజెక్టు ద్వారా 10 టిఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులు చేపట్టింది. జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీజలాల పంపిణీకి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులకు ఎటువంటి నీటికేటాయింపులు చేయలేదని ఆ అధికారులు వివరించారు. కర్ణాటక ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే ఆ రాష్ట్రానికి కేటాయించిన నీటికంటే ఎన్నోరెట్లు అధికంగా నీటిని వినియోగించుకుంటోందని తెలిపారు.

నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తే ఆ ప్రభావం దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంపైన పడుతుందని తెలిపారు. అంతర్ రాష్ట్ర అంశాలు, ట్రిబ్యునల్ తీర్పులను పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని, కానీ కర్ణాటక ప్రభుత్వం చేసే లాబీయింగ్ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉంది గనుక ఎక్కడ కేంద్ర ప్రభుత్వ జల సంఘం అనుమతులు ఇస్తుందోనని టెన్షన్‌గా ఉందని అంటున్నారు. అందుకే అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతులిస్తే తుంగభద్ర నుంచి కృష్ణానదికి నీటి ప్రవాహం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 65 శాతం నీటిలభ్యత ఆధారంగా కర్నాటక రాష్ట్రానికి అదనంగా 61టిఎంసిల నీటి కేటాయింపులు చేసినప్పటికీ, ఆ అమలులో లేదని వివరించారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందువల్ల తీర్పు అమల్లోకి వచ్చేదాకా అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు క్లియరెన్సులు ఇవ్వవద్దని కోరుతూ కేంద్ర జల సంఘానికి లేఖ కూడా రాశామని, అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం చేసే లాబీయింగ్ చలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, చెప్పడానికి వీల్లేని, రాయడానికి అనుకూలంగా లేని విధంగా కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ఉత్తర్వులను తమకు అనుకూలంగా తెచ్చుకుంటారని ఆ అధికారులు వివరించారు.

నదీ జలాల నీటిలభ్యతను ఇరిగేషన్ నియమ, నిబంధనల ప్రకారం 75 శాతం డిపెండబిలిటీ (నీటి లెక్కిస్తారని, కానీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతం డిపెడబిలిటీ లెక్కల ప్రకారం నీటి లెక్కించి, ఆ మేరకు నదిలో లేని నీరు ఉన్నట్లుగా ఎక్కువగా చూపించి, ఆ ఎక్కువగా ఉన్న నీటిలో కర్ణాటక రాష్ట్రానికి కేటాయింపులు పెరిగేటట్లుగా చేసిన మహా మేధావులు కర్ణాటక రాజకీయ నాయకులని ఆ అధికారులు వివరించారు. సదానందగౌడ న్యాయశాఖామంత్రిగా పనిచేసిన కాలంలోనే ఏర్పాటైన ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ ఎలాంటి మార్గదర్శకాలను అనుసరించాలనే అంశాలను కూడా కర్ణాటక ప్రభుత్వ పెద్దలే (కాంగ్రెస్ పార్టీ) అప్పట్లో డిసైడ్ చేశారంటే ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు నదీ జలాల విషయంలో ఎంతటి ఐకమత్యంతో వ్యవహరించేవారో అర్ధంచేసుకోవాలని కోరారు. అదీగాక జస్టీస్ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో భాగంగా ఆల్మట్టి డ్యాం ఎత్తు 519 మీటర్ల పరిమితం చేసి నిర్మించుకోవాల్సి ఉందని, కానీ కర్ణాటక ప్రభుత్వం 524 మీటర్ల ఎత్తుకు క్రెస్ట్‌గేట్లను నిర్మించిందని, కాకుంటే ఆల్మట్టికి వరదనీరు వచ్చినప్పుడు మాత్రం డ్యాంసేఫ్టీని దృష్టిలో ఉంచుకొని 519 మీటర్లకు ఎత్తుకు నీరు చేరగానే గేట్లను ఎత్తి వరదనీటిని దిగువనకు విడుదల చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహిస్తోందని ఆ అధికారులు వివరించారు. 2002 ఆల్మట్టి డ్యాం ఎత్తుకు వ్యతిరేకంగా తెలంగాణలోని రాజకీయ నాయకులు ఆందోళనలు చేస్తూనే వచ్చారు.

కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. విఫలమయ్యామని అంటున్నారు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి ఎస్.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జునఖర్గే జల వనరుల శాఖామంత్రిగా పనిచేశారని, ఆయన హయాంలోనే కృష్ణానదిపై రోడుబ్రిడ్జిలు నిర్మాణాలు జరిగాయని, ఆ రోడ్డు బ్రిడ్జిల కింద చెక్‌డ్యాంలను నిర్మించారని, అవి శాటిలైట్ కెమెరాలకు కూడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకొన్నారని ఆ అధికారులు వివరించారు. అదే విధంగా కృష్ణానదిపైన పంపులు, మోటార్లు పెట్టుకొని పెద్దమొత్తం నీటిని వాడుకోవడానికి 2002లోని ప్రభుత్వం అధికారంగా సబ్సిడీపైన విద్యుత్తును సరఫరా కూడా సరఫరా చేసిందని వివరించారు. ఇలా చిన్ననీటిపారుదల, మధ్యతరహా నీటిపారుదల, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, లిఫ్టుల రూపంలో సుమారు 288 టి.ఎం.సీ.ల అదనపు నీటిని కర్ణాటక వాడుకుంటోందని 2003లోనే టిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫొటోలు, సాక్షాధారాలతో సహా కేంద్ర జల సంఘానికి లేఖలు రాశారు కూడా.

కానీ ఇప్పటి వరకూ ఆ లేఖలపై సిడబ్య్లుసి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే కర్ణాటక జలదోపిడీ జరుగుతున్న వైనానికి సంబంధించి ఓ పెద్ద గ్రంధమే ఉందని, అందుకే తాము ఈ తాజా అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం నుంచి చాలా తేలిగ్గా అనుమతులు తెచ్చుకుంటారని ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండి, కేంద్రంలో ప్రత్యర్ధి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కర్ణాటక అనుకొన్నది అనుకొన్నట్లుగా విజయం సాధిస్తూ వచ్చిందని, కానీ ఇప్పుడేమో రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉంది గనుక కేంద్ర జల సంఘం (సి.డబ్లు.సి) నుంచి అనుమతులు పొందడం కర్ణాటక సర్కార్‌కు పెద్ద కష్టమేమీ కాపోవచ్చునని నీటిపారుదల శాఖలోని ఆ సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు అంతులేని నిరుత్సాహాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం క్లియరెన్స్‌లు ఇస్తుందా? లేదా? అనేది వేచాచూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News