బెంగళూరు: కళాశాలలోకి ప్రవేశించాలంటే, హిజాబ్ తీసేయాలని కోరడంతో కర్నాటకలోని ఇంగ్లీషు ప్రొఫెసర్ రాజీనామా నిర్ణయం తీసుకుంది. తుమకూరులోని జైన్ పియూ కాలేజ్‌లో చాందినీ మూడేళ్లుగా ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. హిజాబ్‌ను తీసేయాలని ఆమెను తొలిసారి కోరడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. “నేను గత మూడేళ్లుగా జైన్ పియూ కాలేజ్‌లో పనిచేస్తున్నాను. ఇంత వరకు నాకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. అయితే ప్రిన్సిపాల్ నిన్న(గురువారం) బోధించేప్పుడు హిజాబ్ లేక ఎలాంటి ఇతర మతపరమైన చిహ్నాలు ధరించకూడదని అన్నారు. కానీ నేను గత మూడేళ్లుగా హిజాబ్ ధరించే బోధిస్తూ వచ్చాను. ఈ కొత్త నిర్ణయం నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. అందుకనే నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను” అని చాందినీ విలేకరులకు చెప్పింది. అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ కెటి మంజునాథ్ మాత్రం తాను గానీ, మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇతరులు కానీ ఆమెను హిజాబ్ తీసేయమని చెప్పనేలేదని అన్నారు.