Monday, January 20, 2025

కర్ణాటక వోటు ఎటు?

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం నల్లేరు మీద నడకేనని సిఓటర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఫలితం ఘంటాపథంగా ప్రకటించినప్పటికీ ఈ రాష్ట్రాన్ని వదులుకోడానికి భారతీయ జనతా పార్టీ బొత్తిగా సిద్ధంగా లేదన్నది కాదనలేని వాస్తవం. కేంద్రంలో ఎదురులేని అధికారాన్ని చలాయిస్తున్న బిజెపి తన సర్వశక్తులు వొడ్డి కర్ణాటక పీఠాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తుందని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఆ రాష్ట్ర అభివృద్ధి మీద అది బాగా దృష్టి పెట్టింది. అప్పర్ భద్ర ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా ప్రకటించి భారీ సహాయాన్ని అందిస్తున్నది. రూ. 21,450 కోట్ల అంచనా వ్యయం కలిగిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ. 5300 కోట్ల సాయాన్ని కేంద్ర ప్రకటించింది. అలాగే బెంగళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్ వేకి ప్రధాని మోడీ ఇటీవలనే ప్రారంభోత్సవం చేశారు. మొత్తం రూ. 16 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

ఈ మధ్య రెండు మాసాల వ్యవధిలో ప్రధాని ఆరుసార్లు కర్ణాటకలో పర్యటించారంటే ఎన్నికల విజయంపై ఎంత గాఢంగా దృష్టి పెట్టారో అర్థంకాక మానదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోని ప్రభుత్వ వ్యతిరేక ఓటును గట్టి పరచుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నది. ప్రజలకు విశేషమైన వాగ్దానాలు కూడా చేస్తున్నది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తూ ప్రజలకు దూరమవుతున్న నేపథ్యంలో సంక్షేమానికి, నగదు చెల్లింపులకు ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ సంకల్పించినట్టు తెలుస్తున్నది. అన్ని ఇళ్ళకు 200 యూనిట్ల వరకు విద్యుచ్ఛక్తిని ఉచితంగా ఇస్తామని, మహిళల యాజమాన్యంలో నడుస్తున్న కుటుంబాలకు నెలకు రూ. 2000 వంతున నగదు సాయం అందిస్తామని, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలలోని ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3000 భృతిని చెల్లిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది.

సామాజికంగా చూసినప్పుడు కర్ణాటక జనాభాలో లింగాయతులు 17%, వొక్కళిగలు 15% వున్నారు. గెలుపొందడానికి వీరి మద్దతు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో సారథ్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంచి నేతగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించడం ద్వారా ప్రజల సానుభూతిని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అతి పెద్ద పార్టీగా వచ్చినప్పటికీ మొదట్లో అధికారంలో నిలదొక్కుకోలేకపోయింది. ఎన్నికలు ముగిసిన వెంటనే గవర్నర్ సాయంతో యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కాంగ్రెస్, జెడి(ఎస్) కలిసి విశ్వాస పరీక్షలో ఆయనను అనతికాలంలోనే అధికారం నుంచి దించివేయగలిగాయి. ఆ తర్వాత కొంత కాలానికి 2019 జులైలో కాంగ్రెస్, జెడి(ఎస్)ల ప్రభుత్వంలో తిరుగుబాటు సంభవించి అది కూలిపోడంతో యెడ్యూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారు. అవినీతి మూలంగా ఆయనను ఆ పదవి నుంచి దించక తప్పని పరిస్థితి బిజెపి కేంద్ర నాయకత్వానికి ఏర్పడింది.

2021లో ఆయనను తొలగించి బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు ఎన్నికలకు తెర లేవడంతో లింగాయత్‌లలో బాగా పలుకుబడి గల యెడ్యూరప్పను, అదే కులానికి చెందిన ముఖ్యమంత్రి బొమ్మైని వెంటబెట్టుకొని ప్రధాని మోడీ కర్ణాటకలో విజయాన్ని చూరగొనాలని ప్రయత్నిస్తున్నారు. మూడవ ప్రధాన పక్షమైన జెడి(ఎస్) ఆ రెండు (బిజెపి, కాంగ్రెస్) పార్టీల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాబోదనే ఆశల్లో పావులు కదుపుతున్నది. ఇటువంటి నేపథ్యంలోనే జెడి(ఎస్) అధినేత హెచ్‌డి కుమారస్వామి గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. బిజెపి, కాంగ్రెస్ నేతల మాదిరిగానే కుమార స్వామి కూడా పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే తాను 78 నియోజక వర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొన్నానని వీటిలో 60 చోట్ల గెలుపు ఖాయమని ఆయన చెబుతున్నారు.

తమకు పట్టున్న మాండ్యా, మైసూర్ జిల్లాల్లో ఇంకా తిరగవలసి వున్నదని కుమార స్వామి ఈ నెల 16న ఒక ఇంటర్వూలో చెప్పారు. 70, 80 స్థానాలపై దృష్టి కేంద్రీకరించి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికలనే సరికి అనేక అంశాలు పని చేస్తాయి. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నప్పటికీ అధికారంలో వున్న పార్టీ తమకు ఏమి చేసిందని ప్రజలు చర్చించుకుంటారు. బిజెపి ప్రభుత్వం బొమ్మై నాయకత్వంలో విపరీతమైన అవినీతి రికార్డును సంపాదించుకొన్నది. కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40% కమీషన్లు వసూలు చేసుకొన్నారనే అపఖ్యాతిని ఆ ప్రభుత్వం మూటగట్టుకున్నది.ఇటీవలే ఒక ఎంఎల్‌ఎ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.

తనకున్న ఈ చీకటి రికార్డును దాటి బిజెపి ఏ విధంగా విజయం సాధిస్తుంది అనేది అసాధారణమైన ప్రశ్న. ముస్లింల రిజర్వేషన్ల రద్దు, హిజాబ్ ఉద్యమం వంటివి బిజెపి ఆశిస్తున్నట్టు హిందూ ఓటును దానికి అండగా మలుస్తాయో లేదో చూడాలి. ఈ ఏడాదిలో ఇంకా మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ మూడు రాష్ట్రాల్లో , ఆ తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వుంటాయనే దానికి కర్ణాటక ఎన్నికలు సంకేతాలు కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News