మన తెలంగాణ/గద్వాల టౌన్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నదులలో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను నదులలోకి వదిలారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఆలయాలకు కార్తీక శోభ
కార్తీక పౌర్ణమి మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. కార్తీక పౌర్ణమి అటు శివునికి.. ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు కావడంతో కార్తీకదీపం వెలిగిస్తే మనం తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి అన్ని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం అనగానే ముందుగానే చెప్పుకునేది దీపోత్సవం. ఈ మాసంలో భక్తులు దీపాలను వెలిగించడం అతి పవిత్రంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నేత్రపర్వంగా జరిగాయి. ఆలయాలన్ని భక్తజనంతో కిక్కిరిసి కనిపించాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు, కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా, తుంగభద్ర నదులల్లో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో వదిలి భక్తిప్రవత్తులు చాటుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి వారికి నిర్వహించే వివిధ సేవల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయాల్లో భక్తులు పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేశారు. కృష్ణ, తుంగభద్ర నదీ పరివాహక బీచుపల్లి, అలంపూర్ పుణ్యక్షేత్రాలలో అర్చకుల ఆధ్వర్యంలో నదీహరతి వైభవోపేతంగా నిర్వహించారు.. కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిటకటలాడాయి. నదీ తీర ప్రాంతాలలో ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రత్యేక వసతులు కల్పించారు.
కిక్కిరిసిన నదీ అగ్రహారం
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని నదీ అగ్రహారం వద్ద కృష్ణానదీ పుష్కరఘాట్ భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తులు నదీలో పుణ్య స్నానాలాచరించి కార్తీకదీపాలు వెలిగించి నదిలోకి వదిలారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Karthika Pournami Celebrations at Jogulamba Gadwal