నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’కి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తికేయ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్, దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్, యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, అడవి శేష్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ‘కార్తికేయ -2’ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ “గివింగ్ టూ ది నేచర్ అని ఒకటి ఉంది. మనం విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తుంటాం. చాలా మంది వాటిని విమర్శిస్తారు. మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో ఏవైతే ఉన్నాయో దాని వెనుక ఒక సరైన వాస్తవం ఉంటుంది. అవి తెలుసుకోకుండా కొన్ని విషయాల్లో కామెంట్ చేయకూడదు. ఇలాంటివే ఈ సినిమాలో బోలెడు ఉన్నాయి”అని పేర్కొన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ “మా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’కి ముందు బాగుందనిపించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తరువాత ఇది మా సినిమాయేనా అని ఫీల్ వచ్చింది. అంత అద్భుతంగా సినిమా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.