Monday, December 23, 2024

ముదిరాజ్‌లకు సదవకాశాలు కల్పిస్తాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తామని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. రాజ్యసభ, ఎంఎల్‌సిలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు.. ఇలా ఎన్నో పదవులు వరిస్తాయ ని పేర్కొన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ శుక్రవారం బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా కాసానికి గులాబీ కండువా వేసి ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ..ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రభుత్వ పరంగా ఎన్నో పథకాలను అమలు చేశామని, రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు కాసాని, మిగతా నాయకులు, అతని అనుచరులంతా బిఆర్‌ఎస్ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌ను ఎంపి చేసుకున్నాం… ఆ తర్వాత ఎంఎల్‌సి చేసుకున్నామని, ఇప్పుడు శాసనమండలి వైస్ చైర్మన్‌గా నియమించుకున్నామని తెలిపారు. మీకు రాజకీయాలు తెలుసు.. మనకున్నవి మొత్తం 119 సీట్లు.. అందులో ఏడు మనవి కావని…అందుబాటులో 112 సీట్లు ఉన్నాయని అక్కడున్నవారిని ఉద్దేశించి కెసిఆర్ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సీట్లలో పెట్టిన వ్యక్తి పక్కా గెలవాలి… ఏదో తమాషాకు అభ్యర్థిని బరిలో దింపి, ఆ సీటును కోల్పోయి, పార్టీకి నష్టం చేకూర్చోవడం రాజకీయం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో అందరం కలిసి కూర్చుందామని చెప్పారు. ఎన్‌టి రామారావు హయాంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసి సాధించామని… దాంతో కొంత మంది రాజకీయ నాయకులు ఎదిగారని చెప్పారు. రాజకీయంగా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి.. చాలా అవకాశాలు ఉంటాయని తెలిపారు.

ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి నాయకులను తయారు చేసుకోవాలి
ముదిరాజ్ సామాజిక వర్గం పెద్దది కాబట్టి ఆ వర్గం నుంచి మనం నాయకులను తయారు చేసుకోవాలని అన్నారు. జిల్లాకు ఒకరిద్దరిని తయారు చేసుకుంటే పార్లమెంట్‌కు పెట్టుకోవచ్చు.. అసెంబ్లీకి పెట్టుకోవచ్చు. ఎంఎల్‌సిలు కూడా కావొచ్చు.. అలా చాలా అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. రాజేందర్ అటు పోయినా.. పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో చేరడం మంచి పరిణామం అని సిఎం కెసిఆర్ అన్నారు. కాసాని జ్ణానేశ్వర్ తనకు పాత మిత్రులని, ఆయన బిఆర్‌ఎస్‌లోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆయన ఎప్పుడో రావాల్సింది అని, మీ దగ్గరికి కాస్త లేటైందని కాసాని అన్నారని పేర్కొన్నారు. బండ ప్రకాష్‌తో పాటు కాసానికి సముచితం స్థానం కల్పించేవాడినని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బిఆర్‌ఎస్‌లోకి వచ్చినందుకు ఆయనను మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతం తెలుపుతున్నానని అన్నారు. కాసానితో పాటు బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారిలో టిడిపి మాజీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, బోయినపల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పిడి గోపాల్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన ప్రకాష్ ముదిరాజ్,

టిడిపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండారి వెంకటేష్ ముదిరాజ్, పటాన్ చెరువు కాంగ్రెస్ లీడర్ సపానాదేవ్ ముదిరాజ్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మేకల భిక్షపతి ముదిరాజ్, పుట్టిరాజ్ ముదిరాజ్, టిడిపి కరీంనగర్ నియోజవర్గ ఇంఛార్జ్ కనకయ్య ముదిరాజ్, టిడిపి ముషీరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ తలారి శ్రీకాంత్ ముదిరాజ్, టిడిపి బాన్సువాడ ఇంఛార్జి కరాటే రమేశ్ ముదిరాజ్, టిడిపి స్టేట్ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు చంద్రహాస్, ముదిరాజ్ మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ ముదిరాజ్, బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మంద శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ నిజాంపేట్ నాయకుడు ఆంజనేయులు ముదిరాజ్, మేడ్చల్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దొంతి నర్సింహులు ముదిరాజ్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.జగదీష్ యాదవ్, టిడిపి స్టేట్ సెక్రటరీ మన్నె రాజు, టిడిపి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ సెక్రటరీ దూసకంటి వెంకటేష్, బాచుపల్లి మాజీ ఎంపిటిసి నందిగామ సత్యనారాయణ, టిడిపి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ మైనార్టీ అధ్యక్షుడు లష్కర్ అశోక్ కుమార్, టిడిపి గుడి మల్కాపూర్ అధ్యక్షుడు అక్కెర శివరాజు ముదిరాజ్ తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి శంభీపూర్ రాజు, ఎంఎల్‌సి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News