Monday, December 23, 2024

టిటిడిపికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

20 సార్లు ఫోన్ చేసినా లోకేశ్ స్పందించలేదని మండిపాటు
నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి
బిఆర్‌ఎస్ పార్టీలోనే అతను చేరే ఛాన్స్??

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు టి టిడిపి దూరంగా ఉండడంతో అందరూ ఊహించినట్లుగానే జరిగింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఇటీవల రెండో సారి ఆయన చంద్రబాబును కలిసి పోటీ చేస్తామంటూ సుమారు 75 మంది జాబితాను అందజేశారు. అధినేత ఇవేమీ పట్టించుకోకుండా ఎన్నికలకు వద్దే వద్దని చెప్పడంతో తీవ్ర నిరాశతో ఆయన వెనుదిరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అంతా సిద్ధం చేసుకున్నాక..పోటీ చేయవద్దని చంద్రబాబు చెప్పారని, ఈ నిర్ణయం తనను చాలా బాధించిందని అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయల్లేదని తాను పార్టీ కార్యకర్తలకు చెప్పలేనని, అందుకే రాజీనామా చేశాననీ కాసాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడటానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు 20 సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదని కాసాని అసహనం వ్యక్తం చేశారు. ఈ సారి పోటీ చేయాల్సిందే అని తెలంగాణలోని పార్టీ కేడర్ మొత్తం కోరుతోందని.. దీనిని అధిష్టానం పట్టించుకోవడమే లేదని కాసాని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

అధినేత చంద్రబాబు కోరితేనే ఖమ్మం మీటింగ్ పెట్టానని ఆయన తెలిపారు. ఆ తర్వాత నిజామాబాద్‌లో మీటింగ్ పెట్టాలన్నారని, ఇంటింటికీ టి టిడిపి అని 41వార్డు ఆవిర్భావ సభ పెట్టించారన్నారు. చంద్రబాబును జైల్లో కలిసి వచ్చాక నారా లోకేష్‌కి 20 సార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదన్నారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళే నిలబడాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇంత జరుగుతుంటే అధినేత చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదని చెప్పారని, తనను ఎందుకు పార్టీలోకి పిలిచినట్లు, ఇప్పుడు ఎందుకు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన చేయడం లేదని చంద్రబాబును అడిగానన్నారు. ఇప్పటికే 60 నుండి 75 మంది వరకు అభ్యర్థులు తయారయి ఉన్నారని, క్యాడర్‌కు పార్టీలో ఉండి న్యాయం చేయలేనని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టి టిడిపికి రాజీనామ చేస్తున్నానన్నారు. మంగళవారం తన క్యాడర్‌ను  పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఎందుకు అభ్యర్థులను పోటీ చేయించటం లేదో చంద్రబాబు చెప్పడం లేదన్నారు.

మరో వైపు నారా లోకేశ్  చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని, తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయనకు పట్టింపు లేదన్నారు. ఆంధ్రలో టిడిపి జనసేనతో పొత్తు .. తెలంగాణలో అదే జనసేన, బిజెపితో పొత్తు… ఇదేం బొమ్మలాట? అని కాసాని మండిపడ్డారు. ఇప్పటికైనా నారా లోకేశ్ ఏమి  మాట్లాడతాడో ఆయనకు తెలియాలన్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఎన్‌టిఆర్ భవన్ కి వచ్చారని, తడాఖా చూపిద్దాం అని చెప్పారని… ఇప్పుడు బాలయ్య కూడా పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యడం లేదన్నారు. తాను చిల్లిగవ్వ కూడా పార్టీ నుంచి తీసుకోలేదని, అన్నిటికీ తానే ఖర్చు చేశానని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. వీటి గురించి అడిగితే తెలంగాణతో తనకు సంబంధం లేదు అని నారా లోకేశ్ అన్నాడట.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండడం అవసరమా? అని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
కాగా తన రాజీనామా విషయాన్ని వెల్లడించిన కాసాని జానేశ్వర్..నేడు మంగళవారం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి తన రాజీనామా విషయాన్ని వెల్లడిస్తూ చంద్రబాబుకు రాసిన లేఖ అంశాన్ని తెలియజేశారు. కాగా టి టిడిపికి ఆయన రాజీనామా చేయడంతో కాసాని ఇక ఏ పార్టీలో చేరతారనే ఉత్కంఠ తాజాగా నెలకొంది. సోషల్ మీడియాలో మాత్రం ఆయన అధికార బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తన మిత్రులు మాజీ అధ్యక్షులు ఎల్. రమణ , మరో మిత్రుడు , పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డిలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో కాసాని కూడా అధికార బిఆర్‌ఎస్ పార్టీలోనే చేరుతారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News