Monday, December 23, 2024

కశ్మీర్ యాపిల్‌కు కష్టాలు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: గిరాకీ వున్న చోటుకి సరుకు వెళ్లడం వ్యాపార ధర్మమే కాదు ప్రజల బతుకు అవసరం కూడా. దాని వల్ల అటు ఉత్పత్తిదారు, ఇటు వినియోగదారు, మధ్యలో వుండే సరఫరాదారు కూడా ప్రయోజనం పొందుతారు. ఇందుకు ముఖ్యావసరం ఆటంకాలు లేని రవాణా సౌకర్యం. ఇది బంద్ అయితే మిగతావన్నీ స్తంభించిపోతాయి. జనజీవనమే అతలాకుతలమవుతుంది. అశాంతి, అలజడి చెలరేగుతాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల రవాణా మార్గాలు మూసుకుపోయి ప్రపంచ మంతటా సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధం సందర్భంగా అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల వల్ల కలిగిన ఆర్థిక కల్లోలం ఒక ఎత్తు కాగా, రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి మిగతా ప్రపంచానికి అందుతూ వచ్చిన ఆయిల్, గోధుమ, ఎరువులు, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి సరకుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి అంతటా ధరలు మండిపోడం మరో ఎత్తు.

అందుచేత సరకు రవాణా మార్గాలను ఎటువంటి అడ్డంకులూ లేకుండా సుగమంగా వుంచాల్సిన బాధ్యత పాలకులపై వుంది. జమ్ము శ్రీనగర్ హైవే పై రెండు మూడు వారాలుగా యాపిల్ ట్రక్కులు ఆగిపోడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని, కొండచరియలు కూలిపోయే ప్రమాదాలున్నాయని చెప్పి ట్రక్కులను అధికారులే ఆపివేయడంతో ఐదు నుంచి ఎనిమిది వేల లారీల యాపిల్ నిలిచిపోయిందని వార్తలు చెబుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో యాపిల్ రోడ్డు మీద ఆగిపోతే అవి ఎంతగా దెబ్బతింటాయో పండించిన రైతుకు, రవాణా చేస్తున్న వ్యాపారులకు ఎంతటి నష్టం వాటిల్లుతుందో ఊహించవచ్చు. ఏ కారణం వల్ల అయినప్పటికీ సరకు ముందుకు వెళ్లే వీలు లేకుండా చేసిన అక్కడి ప్రభుత్వం, అధికారులే ఆ ప్రాంత ప్రజల కూటిలో బుగ్గిపోశారని చెప్పక తప్పదు.

కశ్మీర్‌లో 4 లక్షల కుటుంబాలు యాపిల్ పంటపై ఆధారపడి బతుకుతున్నాయి. ఇన్ని రోజుల పాటు ఇన్నివేల ట్రక్కులను నిలిపివేసినందు వల్ల వారికి ఎంతటి కష్టకాలం దాపురించిందో వివరించనక్కర లేదు. 300 కి.మీ హైవే పొడవునా ట్రక్కులు నిలిచిపోయాయి. దీని వల్ల ఒక్క సోపోర్ యాపిల్ మార్కెట్టే గత కొద్ది రోజుల్లో రూ. 500 కోట్ల వరకు నష్టపోయిందని అంచనా. కశ్మీర్ నుంచి స్థానిక మార్కెట్లకు, మిగతా దేశానికంతటికీ యాపిల్ రవాణా అవుతుంది. బంగ్లాదేశ్, నేపాల్‌కు కూడా సరఫరా అవుతుంది. బంగ్లాదేశ్‌లో కశ్మీర్ యాపిల్‌కు మంచి గిరాకీ వుంది. ఒక బంగ్లాదేశ్ అనే మాట ఏముంది, కశ్మీర్ యాపిల్‌ను కోరుకోని వారు ప్రపంచంలో ఎక్కడా వుండరు. హైవే పొడుగునా కోల్డ్ స్టోరేజీ (శీతలీకరణ గిడ్డంగులు) లున్నాయి. వాటిని నడుపుతున్న బడా వ్యాపారులకు విశేష లాభాలు చేకూర్చడానికే కశ్మీర్ ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షలు విధించిందని ఒక విమర్శ వినవస్తున్నది. గమ్యానికి చేరుకోడం ఆలస్యమవుతున్న కొద్దీ రైతులు, వ్యాపారులు ఈ స్టోరేజీలను ఆశ్రయించవలసి వస్తుంది. లేకపోతే ఎండతగిలి పండు దెబ్బతింటుంది.

చిన్న, మధ్య తరహా రైతులు, వ్యాపారులు ఈ గిడ్డంగులలో భద్రపరచుకునే ఆర్థిక శక్తి బొత్తిగా లేనివారే. అందువల్ల ఈ ట్రాఫిక్ ఆంక్షలతో వారి శ్రమ వృథా అయిపోయి అప్పుల పాలవుతారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యాపిల్ రైతులను, వ్యాపారులను ఈ శీతల గిడ్డంగుల యజమానులకు బలి ఇస్తున్నదని భారతీయ యాపిల్ రైతుల సమాఖ్య ఆరోపించింది. ఈ సమాఖ్య ప్రతినిధులు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిసి హైవేలో అడ్డంకులు తొలగించాలని విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ తక్షణం ప్రయోజనం కలుగలేదని చెబుతున్నారు. ఒక అధికారిని బదిలీ చేశారు గాని దారి అడ్డంకులు తొలగలేదని అంటున్నారు. అయితే బుధవారం నాడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోడంతో ట్రక్కులు కదిలాయని సమాచారం. ఆలోగా జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది.

కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఈ దుస్థితికి ప్రభుత్వాన్నే బాధ్యురాలిని చేస్తూ ప్రకటనలిచ్చాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కలిగించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని, 35ఎను రద్దు చేసిన తర్వాత బయటివారు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోడానికి, భూములను కొనుగోలు చేయడానికి అవకాశం కలిగింది. కాని ఒక్క సెంటు భూమినైనా అమ్మడానికి కశ్మీర్ రైతులు సిద్ధంగా లేరు. వారిని తీవ్ర నిరాశకు గురి చేసి తమ భూమిని అంబానీ, అదానీ తదితర కార్పొరేట్ దిగ్గజాలకు తెగనమ్ముకునేలా చేయాలని కేంద్రం కుట్ర పన్నిందంటూ విమర్శలు వినవస్తున్నాయి. అవేమైనప్పటికీ తన ప్రజల పంటలకు, ఉత్పత్తులకు సకాలంలో సరైన ధరలు లభించి వారు సుఖమయమైన జీవితం గడపడానికి తోడ్పడవలసిన బాధ్యత ఎక్కడి ప్రభుత్వం మీదైనా ఇనుమిక్కిలిగా వుంటుంది. అసలే అనేక నిఘాలతో, అణచివేతలతో విసిగివేసారిపోయి వున్న కశ్మీర్ ప్రజలను ఈ యాపిల్ దిగ్బంధం మరింత బాధలకు గురి చేసి కేంద్ర పాలకులకు వారిని ఇంకా దూరం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News