కిషన్‌గంజ్: బీహార్‌లో ఏడవ తరగతి పరీక్షా పత్రంలో కశ్మీర్‌ను ప్రత్యేక దేశమని పేర్కొన్నారు. బీహార్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఏడవ తరగతి పరీక్షకు సాంఘిక శాస్త్రం ప్రశ్నాపత్రంలో ఏఏ దేశాల ప్రజలను ఏ పేరిట పిలుస్తారు? అని ఓ ప్రశ్న ఉంది. ఇందులో చైనా దేశీయులను చీనీలు అని పిలుస్తారు. మరి నేపాల్, ఇంగ్లాండ్, కశ్మీర్, ఇండియా వారిని ఏమని పిలుస్తారని ప్రశ్న ఉంది. దీనిపై ఇప్పుడు సామాజికంగా పలు విమర్శలు వెలువడ్డాయి. అయితే తమకు ఈ ప్రశ్న పత్రాలు బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి అందాయని, వీటిని తాము పంపిణీ చేశామని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
అయితే కశ్మీర్‌లో నివసించే వారిని ఏమని పిలుస్తారని విడిగా ఉండాలని, అయితే పొరపాటున కశ్మీర్ దేశం వరుసలో వచ్చిందని ఇది చేయకూడని మానవ తప్పిదం అయిందని ఓ టీచర్ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ను వేరే దేశంగా పేర్కొంటూ ప్రశ్నాపత్రంలో తప్పుదొర్లడాన్ని చిన్న విషయంగా భావించరాదని బీహార్ విద్యావేత్తలు, రాష్ట్ర బిజెపి నేతలు విమర్శించారు. విద్యా మంత్రి స్పందించాల్సి ఉందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ జైస్వాల్ స్పందిస్తూ ఇక్కడి నితీశ్ కుమార్ ప్రభుత్వం దృష్టిలో బీహార్ భారతదేశపు రాష్ట్రం కాదని తెలిసింది. నితీశ్‌కుమార్ తరచూ తాను ప్రధాన మంత్రిని కావాలనే యావతోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే చివరికి చిన్నపిల్లల మనస్సులలో జాతి వ్యతిరేక భావనలు నెలకొన్నా పట్టించుకున్నా పట్టించుకునే తీరిక ఆయనకు లేదని వాఖ్యానించారు.
Kashmir as separate country in Bihar Class 7 question paper