Monday, April 21, 2025

కశ్మీర్ అంటే అందమే కాదు.. అందమైన కవిత్వం కూడా

- Advertisement -
- Advertisement -

ఆఘా షాహిద్ అలీ కవితలు
నేను ప్రేమించాను
నేను అమితంగా ప్రేమించిన చోటికి
స్వల్పకాలమయినా తిరిగి వెళ్ళాలి
నేను ప్రేమించిన
ఎంతమందిని
నువ్వు తుడిచిపెట్టేశావో
నీకు చెప్పడానికి

ఉనికి
నువ్వు వెళ్లిపోతే
నా దుఃఖపు ఉనికిని
ఎవరు నిరూపిస్తారు
ఉనికిలోకి రాకముందు
నేనెవర్నో చెప్పవూ. . . .

దహనం
మేము శరీరాన్ని
తగులపెట్టినప్పుడు
నీ ఎముకలు
కాలి బూడిద కావడానికి అంగీకరించలేదు
ఎవరూహించారు
మరణంలోనూ
నువ్వు
మొండి పట్టుదలగలవాడివని

పిలుపు
కళ్ళు మూసుకుంటాను
ఇంట్లోకి చొచ్చుకొచ్చి
అమ్మా నాన్నల ప్రేమను దోచుకొనే
చల్లటి కశ్మీర్ చందమామ
నన్ను వదిలిపెట్టదు
నేను చేతులు తెరుస్తాను
అంతా ఖాళీ ఖాళీ
ఇది విదేశీ దుఃఖం

‘ఇంటికి ఎప్పుడు వస్తున్నావు’
నాన్న అడుగుతాడు
మళ్ళీ మళ్ళీ అడుగుతాడు
మహాసముద్రం ఒక్కసారిగా రక్త నాళాల్లో
పరుగులు పెడుతుంది
‘అంతా బాగున్నారా’
నేను బిగ్గరగా అడుగుతాను

మాటలు నిర్జీవమయిపోతాయి
రక్త నాళాల్లో నీరింకిపోతుంది

సముద్రం నిశ్శబ్దమవుతుంది
దానిపై చల్లని పూర్ణ చంద్రుడు
పరుచుకుంటాడు

కశ్మీర్ అంటే అందమైన ప్రదేశం, ‘ఆటంకవాదం’ మాత్రమే కాదు అక్కడ గొప్ప కవిత్వమూ, కళలూ విలసిల్లుతాయి. కశ్మీర్ బౌగోళికంగా చాలా అందమయిన ప్రాంతం. అక్కడ లోయలు, మైదానాలూ పచ్చదనం ఎంతో హాయిని ఆనందాన్నిస్తాయి. చరిత్రలో ఆప్రాంతం నాగరికతకు, చారిత్ర కు సంగమ స్థలంగా నిలిచింది. గొప్ప ఆలోచనల వేదికగా విలసిల్లింది. అనేక దిక్కులనుంచి ఆలోచనలు ప్రవాహంలా వస్తూ, ఈ ప్రాంత ప్రజల జీవితాలకు విభిన్న స్వభావాన్ని, సమగ్రతను అందించాయనే చెప్పాలి. కశ్మీర్ కేవలం అందానికే కాకుండా గొప్ప జ్ఞానం, పాండిత్యం, వ్యక్తీకరణ సంప్రదాయాల కారణంగా కూడా పరిగణనలోకి వస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే కశ్మీరీ మేధావులు తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, వ్యాకరణం, కవిత్వం, సౌందర్యశాస్త్రం, సంగీతం, నాటక చరిత్ర, సాహిత్యం లాంటి అనేక రంగాలలో రచనలు సృష్టించి, తన ఆలోచనలను ప్రపంచానికి అందించారన్న విషయం అర్థమవుతుంది. ఆచార్య వాసుగుప్త (860-925AD) అందించిన ‘శివ సూత్రాలు’ ఆచార్య అభినవగుప్త (950-1025 AD) శైవ తత్వశాస్త్రం, సౌందర్యశాస్త్రం, సంగీతం, కవిత్వం, నాటకం, తర్కవిద్య రంగాలలో వీరి విశేష కృషితో, శతాబ్దాల పాటు అక్కడి మేధావులు చైతన్యవంతులయ్యారు.

9వ శతాబ్దంలో, ఆనందవర్ధనుడు తన ‘ధ్వని’ సిద్ధాంతంతో సాహిత్య సమీక్షకు విప్లవాత్మక మార్గదర్శనం చేశాడు. దీన్ని అభినవగుప్త మరింతగా విస్తరించాడు. ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు కూడా అక్కడి స్థానిక భాష అయిన కశ్మీరీలో కూడా గొప్ప సృజన జరిగింది. కశ్మీర్ కవిత్వం ఆధ్యాత్మికత, మార్మికత, ప్రకృతి సౌందర్యాలను సమ్మేళనం చేసిందని చెప్పాలి. ప్రసిద్ధ సూఫీ కవులు షంషుద్దీన్ ఇరాకీ మరియు నూర్- ఉద్దిన్ నూర్‌ని (నంద్ రిషి అని కూడా పిలుస్తారు) కశ్మీరీ సాహిత్యంలో మొదటి ప్రముఖ వ్యక్తులుగా పరిగణించబడతారు. వారు ప్రేమ, ఆధ్యాత్మికత, ప్రకృతి వంటి అంశాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. తద్వారా భవిష్యత్ తరాల కవులకు పునాదిని ఏర్పరిచారు. వారి రచనలు కశ్మీరీ కవిత్వంపై శాశ్వత ప్రభావం చూపాయి. తద్వారా తరువాతి కవులు ప్రేమ, బాధ, వేదన, మార్మిక భావాలను అల్లుకుం టూ కవిత్వాన్ని మెరుగు పరిచారు. ఆనాటి కశ్మీరీ కవిత్వ పరంపర ఇప్పటికీ కవులకు ప్రేరణగా ఉంటోంది.

కశ్మీర్‌కు ఆత్మీయ సాహిత్య చరిత్ర ఉన్నప్పటికీ, నేటి కవులు సంప్రదాయ అంశాలను ఆధునిక సమస్యలతో కలిపి, సొంత గుర్తింపును పొందారు. వారు తమ ఆలోచనలను భావోద్వేగంగా సామాజికంగా వ్యక్తీకరించారు. వ్యక్తీకరిస్తున్నారు. ఆధునిక కవుల్లో జరీఫ్ అహ్మద్ జరీఫ్ కవిత్వం కశ్మీరీ సంస్కృతిని కష్టాలను ప్రతిబింబించి కదిలిస్తాయి. శక్తివంతంగా హృదయాన్ని హత్తుకునే భాషతో జరీఫ్ అహ్మద్ జరీఫ్ ఆధునిక కశ్మీరీ కవులలో ప్రముఖులుగా నిలబడ్డారు. ఆయన కవిత్వం కశ్మీరీ సంస్కృతి, ప్రజల కష్టాల్లో ధైర్యంగా లోతుగా మమేకమై ఉంటుంది. ఆయన రచనలు తమ మాతృభూమి బాధలు, ఆవేదనలు, పునరుజ్జీవనాన్ని ప్రతిబింబి స్తూ, ప్రజల ఆవేదనలను ఆశల్ని అద్భుతంగా వ్యక్తీకరిస్తాయి. జరీఫ్ కవిత్వం మనస్సుకు నిండుగా తాకి, ప్రజల మనో భావాలను ప్రతిధ్వనిస్తుంది.

కశ్మీరీ కవిత్వంలో షాహ్నాజ్ బషీర్ తన రచనల ద్వారా కశ్మీర్‌లోని మానవ అనుభవాల లోతులు, అంతర్లీన పోరాటాలు, ఆనందాలు, ఉత్కంఠలను గంభీరంగా అన్వేషించా రు. ఆయన కవిత్వం సమకాలీన సమస్యలను, ముఖ్యంగా సంఘర్షణల ప్రభావాన్ని, ప్రజల జీవితాలపై దీని గాఢతను స్పష్టంగా చిత్రిస్తుంది. ఇక రషీద్ నజ్కీ ప్రత్యేకమైన దృక్పథంతో కూడిన కవి. కశ్మీర్ చరిత్రను, దాని పరివర్తనశీల స్వభావాన్ని ప్రతిధ్వనించే మక్కువతో రచనలు చేస్తున్నారు. ఆయన కవితలు ప్రేమ, విడిపోవడం, సంఘర్షణల ఆవేదన వంటి అంశాలను లోతుగా అన్వేషిస్తాయి. అనంతనాగ్‌కు చెందిన కవయిత్రి నిఘత్సాహిబా, కశ్మీర్‌లోని సామాజిక నిబంధనలను, దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న వ్యవస్థలను సవాల్ చేస్తుంది. ఆ క్రమంలో కవిత్వాన్ని వాహికగా ఉపయోగించడం ద్వారా ఆమె గుర్తింపు పొందారు.

2017లో ఆమె అక్బర్ జైపురి మెమోరియల్ అవార్డును, సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని గెలుచుకుని, కశ్మీరీ, ఉర్దూ కవిత్వంలో అత్యంత ప్రాముఖ్యమైన స్వరంగా నిలబడింది. శ్రీనగర్‌కు చెందిన ఉజ్మా ఫలక్ కశ్మీర్ కథలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన మరో గొప్ప రచయిత్రి. ఆమె జర్మనీలోని హెయిడెల్బర్గ్ యూనివర్సిటీలో డాక్టోరల్ ఫెలోగా ఉన్నప్పుడు, తన కవిత్వం ద్వారా సంఘర్షణలు, హింస వాటి ప్రభావాలను లోతుగా పరిశోధించారు. ఆమె ఎథ్నోగ్రాఫిక్ కవిత ‘పాయింట్ ఆఫ్ డిపార్చర్’ 2017లో ఎథ్నోగ్రాఫిక్ పోయెట్రీ అవార్డులో గౌరవ ప్రస్తావన పొందింది. తన భావోద్వేగ భరిత రచనల ద్వారా, ఉజ్మా సంఘర్షణల వల్ల కలిగే భావోద్వేగ, మానసిక భారాలను చిత్రీకరిస్తూ, కశ్మీరీ ప్రజల స్థితిపై తన అకాడమిక్, కళాత్మక ప్రయత్నాల ద్వారా కొత్త దృక్పథాన్ని అందించారు. ఇక కశ్మీరి కవితావరణంలో ఆఘా షాహిద్ అలీ స్వరం ఇవ్వాళ ప్రపం చ వ్యాప్తంగా ధ్వనిస్తున్నది ఆఘా షాహిద్ అలీ రాసిన ‘ద వేయిల్ద్ సూట్’ (కలెక్టేడ్ పోయెమ్స్) గొప్ప సంకలనం. ఆఘా షహీద్ అలీ విలక్షణమైన కవి. తనను మళ్ళీ మళ్ళీ చదవడం వలన ఎన్నో కొత్త కోణాలు తెలుస్తాయి.

ఇంకా తెలవాల్సినవీ తెల్సుకోవాల్సినవీ అనేకం ఉన్నాయి. ఆయన కవిత్వం నిండా కశ్మీర్ పట్లా కశ్మీర్‌లో జరిగిన అత్యాచారాలు, అరాచకాల పట్ల కోపమూ వేదనా కనిపిస్తాయి. అయితే ఆ భావనలన్నీ కవిగా గొప్ప మానవ గాంభీర్యత, నైతిక ప్రేమలతో ప్రకటిస్తాడు. తను కవిత్వం మొత్తంగా ఇంగ్లీషులోనే రాసాడు. మొదట వచన కవిత్వం ఫ్రీవర్స్‌తో ఆరంభించినప్పటికీ కాల క్రమంలో ఆంగ్ల వచన కవిత్వంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రాస్తూ వచ్చా డు. గజల్ రూపాన్ని చాలా ఇష్టపడ్డాడు. ఆఘా షాహిద్ అలీ ముస్లిం, హిందూ, పాశ్చాత్య మూడు సంస్కృతుల సమ్మేళనంగా కనిపిస్తాడు. ఢిల్లీలో పుట్టిన ఆయన చాలాకాలం శ్రీనగర్‌లో పెరిగాడు. తర్వాత కొంతకాలం ఇండియానాలో ఉన్నారు. అక్కడే హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్నాడు. కశ్మీర్, ఢిల్లీ విశ్వద్యాలయాల్లో చదువు తర్వాత షహీద్ పెన్సిల్వేనియా విశ్వద్యాలయంలో పీహెచ్ డీ పూర్తి చేసాడు. అంతేకాదు అరిజోన విశ్వ విద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్‌లో మాస్టర్ డిగ్రీ కూడా చే సాడు. అందుకే ఆయన సృజనాత్మక రంగం విస్తారమయ్యింది. వివిధ దేశాల సాహిత్యంతో పాటు బాలీవుడ్, హాలీవుడ్, సమాంతర ఆర్ట్ సినిమా ఇట్లా అనేక కోణాల్లో ఆయన కృషి చేసాడు. దాంతో పాటు సంగీతంలో కూడా షాహిద్ కృషి కొనసాగిం ది.

షాహీద్ పైన బేగం అఖ్తర్ ప్రభావం అధికంగా ఉంది. ఫలితంగా గజల్స్‌పైన అధిక మమకారం పెంచుకున్నాడు. షాహీద్ అనేక అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా పనిచేసాడు. ఆయన జీవితంలో కశ్మీర్ విషాదంతో పాటు స్వంత తల్లి అనారోగ్యం ఎంతో ప్రభావం చూపింది. ఆఘా షహీద్ తల్లి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడి మరణించారు. అమ్మలేని ఆ లోటు నుంచి కోలుకోవడం అంత సులభం కాలేదు. విషాదం ఏమిటంటే ఆఘా షాహీద్ అలీ 2001లో అదే బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించాడు. ‘ద వేయిల్ద్ సూట్’ (కలెక్టేడ్ పోయెమ్స్)లో షాహీద్ రాసిన ‘ద హాఫ్ ఇంచ్ హిమాలయాస్’, ‘ఎ వాక్ త్రూ ది ఎల్లో పేజెస్’, ‘ఎ నాస్టాల్జిక్ మాప్ ఆఫ్ అమెరికా’, ‘ద కంట్రీ వితౌట్ పోస్ట్ ఆఫీస్’, ‘రూమ్స్ ఆర్ నెవర్ ఫినిష్‌డ్’, ‘కాల్ మి ఇష్మాయిల్‌తో నైట్’ కవితా సంకలనాల్లోంచి తీసుకున్న కవితలున్నాయి. ఇంకా షాహీద్ అనేక కవితా సంకలనాలు వెలువరించారు. తను మంచి అనువాదకుడు కూడా. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్ని ‘ద రెబెల్స్ సిల్హౌట్:సెలెక్టేడ్’ పేర ఇంగ్లీష్‌లోకి చేసాడు. షాహీద్ కవిత్వా న్ని, తనని ఇంకా అర్థం చేసుకోవాల్సే ఉంది. ఆ కృషిని కవిత్వాభిమానులంతా చేయాల్సి ఉంది. షాహీద్ అలికి ‘పుష్కార్ట్ ప్రైజ్’, న్యూయార్క్ ఫౌండేషన్ ఫర్ ఆర్ట్ వారి ఫెలోషిప్ తదితర పురస్కారాలు లభించాయి.

ఆంగ్లమూలం: ఆఘా షహీద్ అలీ
(ప్రసిద్ధ కశ్మీరీ-అమెరికన్ కవి)
తెలుగు: వారాల ఆనంద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News