శ్రీనగర్: స్వాతంత్య్ర దినోత్సవం నాటి నుంచి కశ్మీర్‌లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్ లోని సోపియాన్ జిల్లాలో చోటిపోరా ప్రాంతం లోని యాపిల్ తోటలో ఉగ్రవాదులు మంగళవారం కాల్పులకు తెగబడడంతో కశ్మీర్ పండిట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఉగ్రవాదులు వారం రోజుల వ్యవధిలో జరిపిన రెండో లక్షిత హత్య ఇది. బాధితులిద్దరూ మైనారిటీ వర్గానికి చెందిన వారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని సునీల్ కుమార్‌గా గుర్తించారు. ఈ సంఘటనకు గవర్నర్ మనోజ్ సిన్హా, పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జరిగిన లక్షిత దాడుల్లో మొత్తం 14మంది పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు.
Kashmir Pandit shot dead by terrorists