న్యూఢిల్లీ: భీమా కోరేగావ్ కేసులో నిందితుడు గౌతమ్ నవ్‌లఖాకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధరన్‌ను కించపరిచే విధంగా ట్వీట్లు చేసిన కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మంగళవారం న్యాయమూర్తికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు.
తాను పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించినట్లు కూడా ఆయన కోర్టుకు తెలిపారు. అయితే, వివేక్ అగ్నిహోత్రి తన ట్వీట్లను తొలగించి ఉండకపోవచచని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది అరవింద్ నిగమ్ మంగళవారం కోర్టుకు తెలిపారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను కించపరిచే విధంగా, అప్రతిష్ట పాల్జేసే విధంగా ఉన్న ట్వీట్లను ట్విట్టర్ తొలగించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కాగా..వివేక్ అగ్నిహోత్రి క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ వచ్చే ఏడాది మార్చి 16న జరిగే తదుపరి విచారణకు ఆయన స్వయంగా హాజరుకావాలనిఇ జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ తల్వంత్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేక్ కోర్టుకు స్వయంగా హాజరై క్షమాపణ చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.