- Advertisement -
న్యూఢిల్లీ: దివంగత హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీ అల్లుడు కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు అల్తాఫ్ అహ్మద్ షా మంగళవారం తెల్లవారుజామున క్యాన్సర్ వ్యాధితో ఎయిమ్స్‌లో కన్నుమూశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైలు నుంచి 66 సంవత్సరాల షాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు షా కుమార్తె రువా షా తెలిపారు. ఒక ఖైదీగా ఎయిమ్స్‌లో తన తండ్రి షా మరణించినట్లు ఆమె ట్వీట్ చేశారు. శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతానికి చెందిన షా 2017 జులై 25న మరో ఆరుగురితో కలసి అరెస్టు అయ్యారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి సంబంధించి ఎన్‌ఐఎ నమోదు చేసిన కేసులో షా నిందితునిగా విచారణను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో షాకు మెరుగైన వైద్యం అందచేసేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించవలసిందిగా ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 5న అదేశించింది.
- Advertisement -