Friday, February 21, 2025

కర్నాటకలో కాశ్మీరీ విద్యార్థికి దారుణమైన ర్యాగింగ్ అనుభవం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక విజయపురలో ఒక వైద్య కళాశాలలో రెండవ సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థి ఒకరిపై దాడి జరిగినట్లు తెలియవచ్చింది. బాధితుడైన అల్‌అమీమ్ వైద్య కళాశాలలో రెండవ సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థి హమీమ్ జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన వాడు. 2019 బ్యాచ్‌కు చెందిన సీనియర్ విద్యార్థులు తనను దారుణంగా ర్యాగింగ్ చేసినట్లు, బెదరించినట్లు ఆ విద్యార్థి ఆరోపించాడు. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మంగళవారం సాయంత్రం ఆ సంఘటన మొదలైందని తెలుస్తోంది. కాలేజి ఆవరణలో 2019, 2022 బ్యాచ్‌ల మధ్య ఒక మ్యాచ్‌ను మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటలకు హమీమ్ చూస్తుండగా, ఒక సీనియర్ విద్యార్థి అతనిని బౌండరీ లైన్‌కు ఆవల ఉండవలసిందని ఆదేశించాడు.

అతను మౌనంగా ఆ ఆదేశాన్ని పాటించి, దూరం నుంచే మ్యాచ్ చూడసాగాడు. సీనియర్లు కొందరు అతనిని బెదరించినప్పుడు ఉద్రిక్త స్థితి నెలకొంది. వారు అతని ఉనికిని ప్రశ్నించి, వెళ్లిపోవలసిందని కోరారు. కానీ హమీమ్ అందుకు నిరాకరించాడు. అప్పుడు సీనియర్లు కొందరు తమ వినోదం కోసం అతనిని పాటలు పాడవలసిందని, డ్యాన్స్ చేయవలసిందని బలవంతం చేశారు. ఆ అవమానం అంతటితో ఆగలేదు. సీనియర్లు అతనిని బలవంతంగా ఒక కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అతను ఆ సంఘటనను రికార్డు చేయడానికి తన ఫోన్‌ను బయటకు తీసినప్పుడు వారు మరింత దురుసుగా ప్రవర్తించారు. ఆ తరువాత రాత్రి ఆరుగురు నుంచి ఎనిమిది మంది వ్యక్తులు హమీమ్ హాస్టల్ గదిలోకి దూసుకుపోయారు.

వారు అతనిపై దౌర్జన్యం చేసి, ఒత్తిడితో క్షమాపణ చెబుతున్నట్లుగా వీడియో రికార్డు చేయించారు. ‘నీకు ఇంకా ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఉన్నాయి. మేము స్థానికులం& నీ జీవితాన్ని ఎంత భయంకరంగా మేము చేయగలమో ఊహించుకో’ అని దుండగులు అతనిని హెచ్చరించారు. కాలేజీలో తక్కిన కాలంలో క్రికెట్ ఆడనివ్వబోమని కూడా అతనితో వారు చెప్పారు, జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల సంఘం జాతీయ కన్వీనర్ నసీర్ ఖుహామీ ఒక ప్రకటనలో ఆ దాడిని ఖండించారు. ‘అది ఎంతో దారుణమైన ర్యాగింగ్, దౌర్జన్యం కేసు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో కర్నాటక ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని బాధితునికి న్యాయం చేయాలని, సంఘటన బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని ఖుహామీ విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News