శ్రీనగర్ : మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌శర్మ (ఫోటో) తలను నరికినట్టు ప్రదర్శిస్తూ ఓ వీడియోను చిత్రీకరించినందుకు కశ్మీర్‌కు చెందిన యూట్యూబర్ ఫైజల్ వనీని పోలీసులు అరెస్ట్ చేశారు. వనీ యూట్యూబ్‌లో ‘డీప్ పెయిన్ ఫిట్నెస్ ’ పేరుతో ఓ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఈ వివరాలను జమ్ముకశ్మీర్ పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ వీడియో ప్రజల్లో భయాందోళనలు కలిగించిందని పోలీసులు చెప్పారు. ఈరోజు వనీ ఆ వీడియోను తొలగించేశాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో క్షమాపణ పోస్టు చేశాడు. నూపుర్‌శర్మ తలను తెగ్గోసినట్టు నిన్న తాను విఎఫ్‌ఎక్స్ వీడియోను రూపొందించానని, అది క్షణాల్లోనే వైరల్ అయిందని, అయితే తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఆ వీడియో ఎవరినైనా గాయపరిచి ఉంటే క్షమించాలని కోరినట్టు వనీ చెప్పాడు. ఇతర మతాల వారి నమ్మకాలను గాయపర్చే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. నూపుర్‌శర్మ ఈనెల మొదట్లో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లి దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బిజేపి అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నూపుర్ శర్మతోపాటు మరో నేత నవీన్ జిందాల్‌పై చర్యలు తీసుకుంది. టీవీ చర్చల్లో పాల్గొనే ప్రతినిధులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.