Tuesday, December 17, 2024

జిందగి మే నయాదౌర్ ఓటేసిన తరువాత కశ్మీరీల స్పందన

- Advertisement -
- Advertisement -

బారాముల్లా : ఎన్నాళ్లకెన్నాళ్లకు ఓటేశాను.. నన్ను నేనుగా చాటుకున్నానని కశ్మీర్‌లోని పలు ప్రాంతాలలో జనం తమ ఓటు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు 5వ విడత పోలింగ్ కశ్మీర్‌లో కూడా సోమవారం జరిగింది. గతంలో తమకు ఓటేసేందుకు అవకాశం రాలేదని, భయం భయంగానే ఎన్నికల ఘట్టాలు ముగిసినట్లు, ఇప్పుడు భద్రత నడుమ తాము ఓటేయగల్గినట్లు 52 ఏండ్ల ఓటరు గులామ్ ఖాదీర్ దర్జీ తెలిపారు. దేశం కోసం ప్రగతికోసం పాటుపడే ప్రభుత్వ స్థాపన దిశలో పనిచేసే పార్టీకి తన ఓటేసినట్లు వివరించారు.

సోపోరేలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుని ఆయన పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తరువాత స్పందించారు. ముఖంలో ఆనందం తొంగిచూసింది. కొత్త ప్రభుత్వం ఏదైనా యువతకు సరైన ఉద్యోగాలు కల్పించాలని, దీనితోనే వారిలోని అశాంతి సమసిపోతుందని రిటైర్డ్ ఉద్యోగి అయిన దర్జీ తెలిపారు. బారాముల్లా నియోజకవర్గంలోని సోపెరేలో ఓటేసేందుకు జనం పెద్ద ఎత్తున క్యూలలో నిలబడ్డారు. ఈ ప్రాంతం ఒకప్పుడు వేర్పాటువాద సంబంధిత ఉగ్రవాద కార్యకలాపాలకు పెట్టింది పేరు. ఇంతకు ముందు ఇక్కడ జరిగిన పలు ఎన్నికల సందర్భాలలో వేర్పాటువాదులు నేరుగా రంగంలోకి దిగడం, ఎన్నికల బహిష్కరణకు గన్స్ పట్టుకుని వచ్చి మైక్‌లలో బెదిరించడంతో ప్రజలు ఎక్కువగా ఓటు వేసుకోవడానికి ముందుకు రాలేదు.

ఆర్టికల్ 370 రద్దు తరువాతి తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌కు పలు ప్రాంతాలలో ఉత్సాహం కన్పించింది. తన 40 ఏండ్ల వయస్పు దశలో ఓటేయడం అంటే గండంగా ఉండేదని, ఇప్పుడు ఈ అనుభవాలు లేవని జావెద్ అహ్మద్ గుర్రూ తెలిపారు. మూడు దశాబ్దాలలో ఇది తమ తొలి ఓటు అని చెప్పారు. మా మంచి కోసం రేపటి తరం భవిత కోసం ఈఓటుకు దిగామని తెలిపారు. వేర్పాటువాద శక్తుల ఎన్నికల బహిష్కరణల పిలుపు ప్రభావం ఇంతకాలం తమను ఎటువంటి ఎన్నికల్లో అయినా ఓటుకు దూరం చేస్తూ వచ్చిందని చెప్పారు. ఇక కొత్తగా ఓటు హక్కు పొందిన వారు కూడా ఇష్టంగా వెళ్లి ఓటేశారు. 18 ఏండ్ల మీర్ మసూమ్ సుల్తాన్ ఈ ఓటు బుల్లెట్ కన్నా మిన్న అన్నాడు.

రాజకీయ ఫలితాల ఖరారులో వ్యక్తుల గళం, వారి స్పందన కీలకం అవుతుందని చెప్పారు. జైలులో ఉన్న తన వాడిని విడిపించుకునేలా చేసేందుకు వీలుగా తన ఓటు ఫలానా పార్టీకి వేశానని తెలిపారు. దేనినైనా వ్యక్తీకరించేందుకు ఓటు ఆయుధం కూడా అవుతుందని అభిప్రాయపడ్డారు. బారాముల్లా ఎంపి స్థానం నుంచి 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా , వేర్పాటువాద నేత, ఇప్పటి రాజకీయ ప్రముఖుడు పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్దాద్ లోనే ఇతరులు ఉన్నారు. కాగా ఇక్కడ పిడిపి కూడా రంగంలో ఉంది. కాగా అవామీ ఇత్తేహాద్ పార్టీ (ఎఐపి) ఛైర్మన్, ఉగ్రవాదులకు నిధుల చేరవేత కేసులో నిందితుడుగా ఇప్పుడు తీహార్ జైలులో ఉన్న షేక్ అబ్దుల్ రషీద్ కూడా ఉన్నారు. ఈ నేతను విడిపించేందుకు తమ వంటి వారు ఓటేస్తున్నామని కొత్తగా ఓటు పొందిన పలువురు యువకులు చెప్పడం కీలకం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News