Sunday, January 19, 2025

‘కచ్చతీవు’లో ఓట్ల వేట

- Advertisement -
- Advertisement -

ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా అంశాలను లేవనెత్తి పబ్బం గడుపుకోవడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన కేంద్రంలోని పెద్దలు తమ అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని వెలికితీశారు. అదే.. కచ్చతీవు! ఫలితంగా ఎన్నికల సమయాన ఈ వివాదం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చినికి చినికి గాలివానగా మారుతోంది. కచ్చతీవు ఇప్పటికిప్పుడు వెలుగు చూసిన అంశమేమీ కాదు. తమిళనాట ఎన్నో ఏళ్లుగా నలుగుతున్నదే. విపక్షాలను కూడగట్టి, కూటమిగా ఏర్పరచి ఎన్నికల సన్నాహానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ మెడలు వంచేందుకు కచ్చతీవు కలసి వస్తుందని బిజెపి భావించింది కాబట్టే ఇప్పుడది ముఖ్యాంశంగా మారింది. తమిళనాట డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలకు పలు దఫాలుగా కచ్చతీవు ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడిన మాట వాస్తవం. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీతో 2016లో భేటీ అయిన సందర్భంగా కచ్చతీవు అంశాన్ని ప్రస్తావించారు. తమిళనాడు- శ్రీలంక జాలరుల మధ్య తరచూ ఘర్షణలకు ఆలవాలంగా మారిన కచ్చతీవు వివాదాన్ని పరిష్కరించవలసిందిగా కోరారు.

అయినా, గత పదేళ్లుగా ఈ అంశాన్ని పట్టించుకోని ప్రధాని.. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో హఠాత్తుగా కచ్చతీవు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆశ్చర్యకరం. తమిళనాడుకు చెందిన బిజెపి నాయకుడు అన్నామలై ఇటీవల ఆర్‌టిఐ ద్వారా కచ్చతీవుపై సమాచారం సేకరించడంతో దానిని ప్రధాని ఎన్నికల అస్త్రంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోంది. ఇండియా -శ్రీలంక దేశాలను వేరు చేస్తున్న పాక్ జలసంధిలో ఉన్న అతి చిన్న దీవి కచ్చతీవు. దీని విస్తీర్ణం కేవలం 285 ఎకరాలు. 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు కలిగిన ఈ దీవిలో ఉన్నది ఒకే ఒక్క చర్చి. అగ్నిపర్వతం బద్దలు కావడంతో ఏర్పడిన ఈ భూభాగం జనావాస రహితం. ఒకప్పుడు జాఫ్నా రాజ్యంలో భాగంగా ఉన్న కచ్చతీవు ఆ తర్వాత రామనాడ్ పాలకుల అధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు ఈ దీవిని తమ నావికా దళాలకు తుపాకీ శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించుకునేవారు. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కచ్చతీవు శ్రీలంక అధీనమైంది. ‘కచ్చతీవును కాంగ్రెస్ ఎలా నిర్లక్ష్యంగా వదిలేసిందో తెలియచెప్పే కొత్త వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి’

అని ప్రధాని వ్యాఖ్యానించినా, కచ్చతీవు అప్పగింత రాజ్యాంగ వ్యతిరేకమంటూ జయలలిత 2008లోనే సుప్రీం కోర్టులో కేసు వేశారన్న విషయం గమనార్హం. ప్రధాని వ్యాఖ్యలకు కాంగ్రెస్ సైతం దీటుగా జవాబిస్తోంది. ఈ దీవిని వెనక్కి తీసుకోవడంలో గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేమిటని నిలదీస్తోంది. జయలలితతో సహా పలువురు కేసులు వేసిన నేపథ్యంలో 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరణ ఇస్తూ కచ్చతీవును వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత దేశానికి చెందిన ఏ భూభాగమూ శ్రీలంక అధీనంలో లేనందున కచ్చతీవును స్వాధీనం చేసుకోవాలన్న ప్రశ్న ఉత్పన్నం కాదని పేర్కొంది. ఇదే కేసులో కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ‘కచ్చతీవును వెనక్కి తీసుకోవాలంటే యుద్ధం చేయడమొక్కటే దారి’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. వైశాల్యాన్ని బట్టి కచ్చతీవును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం గానీ, సైనిక స్థావరం ఏర్పాటు చేయడంగానీ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమే అయితే, శ్రీలంక ఇప్పటివరకూ ఆ దీవిని ఎందుకూ కొరగానిదిగా వదిలేసి ఉండేది కాదు.

కచ్చతీవు సమీపాన అపారమైన మత్స్య సంపద ఉన్న కారణంగా తెలిసీ తెలియక శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్న తమిళ జాలర్లను లంక నావికా దళం అరెస్టు చేస్తోంది. వారి విలువైన పడవలను, వలలను ధ్వంసం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో కాల్పులు జరిపి అమాయక జాలర్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటోంది. ఏటా కచ్చతీవులోని సెయింట్ ఆంథొని చర్చిలో జరిగే వేడుకలకు మాత్రమే భారత జాలర్లకు అనుమతి ఉందని వాదిస్తున్న శ్రీలంక ప్రభుత్వం, చేపల వేటపై ఉక్కుపాదం మోపుతోంది. దశాబ్దాల తరబడి భారత జాలర్లపై లంక నావికాదళం జరుపుతున్న దురాగతాలకు ముకుతాడు వేసేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టవలసిన ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలో మాత్రమే కచ్చతీవు గుర్తుకు రావడం విచారకరం. భారత ప్రభుత్వం తలచుకుంటే, మన జాలర్ల వైపు కన్నెత్తి చూడకుండా శ్రీలంకను కట్టడి చేయడం అంత కష్టమేమీ కాదు. అందుకు కావలసింది కాస్త చిత్తశుద్ధి, మరికాస్త నిబద్ధత మాత్రమే!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News