హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, ఈ ఘటనపై బిఆర్‌ఎస్ పార్టీ నేతలు కనీసం ఖండించరా? అని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంఎల్‌ఏ కాట్రగడ్డ ప్రసూన ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టి 14 ఏళ్ల పాటు సుపరిపాలన అందించిందని, తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు రాజకీయ ప్రాధాన్యతను ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.
సామాజిక న్యాయాన్ని అమలు చేసిన తమ తెలుగుదేశం పార్టీని అధికార పార్టీ నేతలు, మంత్రులు కూడా టిడిపి ఉనికి ఎక్కడ? అని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఆ మాటకు వస్తే అధికార పార్టీ నేతలు రాజకీయ ఆరంగేట్రం చేసిందే తెలుగుదేశం పార్టీ నుండి అని, తెలుగుదేశం పార్టీలోనే వారు అనేక మంత్రిత్వ పదవులను అనుభవించారని గుర్తు చేశారు. రాజకీయ దురుద్ధేశంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెడితే దీనిని అధికార పార్టీ కనీసం ఖండించలేదన్నారు.
ఐటి ఉద్యోగులు స్వచ్ఛందంగా బయటికి వచ్చి చంద్రబాబుకు సంఘీభావంగా ర్యాలీ చేశారని, అమెరికాలోని ప్రతి వీధిలో చంద్రబాబుకు సంఘాభావంగా అక్రమ అరెస్టుపై నిరసనలు చేస్తున్న విషయాన్ని అయినా గుర్తిస్తారా? లేదా? అని అన్నారు. అమెరికా తదితర ప్రాంతాల్లో నిరసన చేసుకోనిచ్చారని, మీ దృష్టిలో అక్కడి ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలా? అని కాట్రగడ్డ ప్రసూన అన్నారు.