Friday, November 15, 2024

కౌశిక్‌రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇద్దరు ఎంఎల్‌ఎల మధ్య వివాదం పొలిటికల్ హీట్‌ను రాజేసింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఇంటికి వెళ్లి మరీ అరికెపూడి గాంధీ సవాల్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్ ఇంటిపై కార్యకర్తలు, అనుచరులు టమోటాలు, గుడ్లతో దాడికి దిగారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్యే ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇద్దరు ఎంఎల్‌ఎల మధ్య సవాళ్లు దుమారం రేగిన నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే ఇద్దరు ఎంఎల్‌ఎల ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హూజురాబాద్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు చర్యలు చేపట్టారు. అరెకపూడి ఇంటికి వెళ్లి బిఆర్‌ఎస్ కండువా కప్పుతానని ఆ పార్టీ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరాలు. దాన్ని స్వీకరిస్తున్నట్లు అరెకపూడి గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశారు.

నేను మీ ఇంటికి వస్తా… తట్టుకునే దమ్ముందా..? :- అరికెపూడి గాంధీ
ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీని ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) ఛైర్మన్‌గా నియమిస్తూ ఇటీవల శాసన సభాపతి నిర్ణయించారు. బిఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచి ఫిరాయించిన ఎంఎల్‌ఎకు పిఎసి ఛైర్మన్ పదవి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అరెకపూడి ఇంటికి వెళ్తానని, బిఆర్‌ఎస్ కండువా కప్పుతానని కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. దీంతో ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ స్పందించారు. బాత్రూమ్‌లో ఉండి డీలింగ్‌లు నడిపే ప్రతి ఒక్కడూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ఇంటికొస్తా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే ఖాళీగా ఉన్నామా..? అని కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కెసిఆర్ లాంటి పెద్ద మనుషులు అలాంటి కామెంట్స్ చేస్తే స్వాగతించేవాడినని, తనతోటి శాసనసభ మిత్రులు అడిగినా బదులిచ్చేవాడినని తెలిపారు. ఇలాంటి వారు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా..? అని ప్రశ్నించారు. నన్ను గెలిపించకుంటే చచ్చిపోతా అని భయపెట్టి ఎంఎల్‌ఎగా గెలిచిన వారికి తన గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో ప్రజలు నన్ను మూడుసార్లు గెలిపించారని, వారికి తాను సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. కానీ ఇలాంటి బ్రోకర్లకు, లోఫర్లకు, చీటర్లకు తాను జవాబు చెప్పే అవసరం లేదని, ఎంఎల్‌ఎల ఫిరాయింపులో ఢిల్లీ దాక చర్చలు చేసిన కౌశిక్‌రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. నేనే మీ ఇంటికి వస్తా… తట్టుకునే దమ్ముందా..? అని- అరికెపూడి గాంధీ సవాల్ విసిరారు.

నా ఇంట్లో నేను ఉంటే దాడి చేశారు : కౌశిక్‌రెడ్డి
కోట్లకు అమ్ముడుపోవడం, భూ పంచాయితీలో సెటిల్‌మెంట్ల కోసమే అరెకపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బిఆర్‌ఎస్ బి.ఫాంపై గెలిచి కాంగ్రెస్‌లో ఎలా చేరతావని నిలదీశారు. ధైర్యం ఉంటే ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లోనే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని పేర్కొన్నారు. అరెకపూడి గాంధీ బిఆర్‌ఎస్‌లోనే ఉంటే గాంధీ తెలంగాణ భవన్‌కు రావాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ఇద్దరం కెసిఆర్ వద్దకెళదామని చెప్పారు. శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో కలిసి అరెకపూడి గాంధీ ఇంటికెళ్తామని తెలిపారు. గాంధీ తమ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నందునే ఆయన ఇంటికెళ్తామని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనను సాదరంగా తోడ్కొని తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి నేరుగా కెసిఆర్ వద్దకెళ్తామని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి వెళ్లిన ప్రతి ఎంఎల్‌ఎ గురించి తాను మాట్లాడనని వివరించారు.

రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఎలా అయ్యారో ఆయన్నే అడగండని గాంధీని ఉద్దేశిస్తూ కౌశిక్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డికి తాను ఏం సాయం చేశానో ఆయననే అడగాలని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరలేదని అరెకపూడి గాంధీ అన్నారని, ఆయన తమ పార్టీ ఎంఎల్‌ఎ అని అందుకే ఆయన ఇంటికెళ్తానన్నానని, అందులో తప్పేముందని అన్నారు. వ్యక్తిగత దూషణలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక ఎంఎల్‌ఎకు రక్షణ లేదు అని, ఇక సామాన్యులకు ఏం రక్షణ ఉంటుందని మండిపడ్డారు. తనపై గాంధీ అనుచరులు హత్యాయత్నం చేశారని, మహిళలపై కూడా దాడి చేశారని అన్నారు. తన తండ్రి పడుకునే గది అద్దాలు ధ్వంస చేశారని చెప్పారు. దాడి విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదని, శుక్రవారం ఉదయం 11 గంటలకు గాంధీ నివాసానికి వెళ్లి అయనకు గులాబీ కండువా కప్పుతానని కౌశిక్‌రెడ్డి తెలిపారు.

గాజుల సంస్కారం నేర్పిందే రేవంత్‌రెడ్డి : చీరలు, గాజుల సంస్కారం నేర్పిందే రేవంత్‌రెడ్డి అని కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి నేర్పిన సంస్కారాన్ని తాను అనుసరించినట్లు పేర్కొన్నారు. తాను బిఆర్‌ఎస్‌లో చేరిన రోజు కాంగ్రెస్‌లో ఉన్నది ఐదుగురే అని చెప్పారు. ఐదుగురు ఎంఎల్‌ఎలే ఉంటే బిఆర్‌ఎస్‌లోకి పదిమందిని తానెలా తీసుకెళ్తానని అడిగారు. తనకు బిఆర్‌ఎస్‌తో పంచాయితీ లేదని గాంధీ అంటున్నారని, తనతోనే తన పంచాయితీ అని చెబుతున్నారని తెలిపారు. ఆయనకు, తనకు ఏమన్నా భూతగాదాలు ఉన్నాయా..? అని గాంధీని ఉదేశిస్తూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తన్నుకోవడం పెద్ద విషయం కాదా..? అని పేర్కొన్నారు. ఇద్దరం ఒకరికొకరు తన్నుకోవచ్చని కానీ ప్రజాస్వామ్యంలో మంచిది కాదు కదా..? అని హితవు పలికారు.

కౌశిక్‌రెడ్డికి ఇంటికి హరీశ్‌రావు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ పార్టీ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీశ్ రావు కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ పోలీసులు, ప్రభుత్వం వైఫల్యం చెందాయని, కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వమే దాడి చేయించిందని ఆరోపించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సైబరాబాద్ సిపి మాట్లాడితే అరెస్ట్ చేస్తామన్నారు అని, ఏం చేశారని నిలదీశారు. ఎస్కార్ట్ ఇచ్చి మరీ గాంధీని తీసుకొచ్చారని, ఇదేనా ప్రజాపాలన..? అని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో తన కార్యాలయంపై దాడి చేశారని, ఖమ్మంలో తమపై దాడి విషయమై ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని అన్నారు. గాంధీ వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్ రెడ్డి దాడి చేయించారని ఆరోపించారు. గాంధీని ఇంట్లో హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ దాడి అని పేర్కొన్నారు. శాంతి భద్రతలు కాపాడాలని అనుకుంటే,

చట్టంపై నమ్మకం ఉంటే ఎసిపి, సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వదిలిపెట్టం అని, ఎంత దూరమైనా వెళ్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒక ఎంఎల్‌ఎ పైనే దాడి జరిగితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక ఏ కంపెనీలైనా ఆసక్తి చూపుతాయా..? అని నిలదీశారు. హైదరాబాద్‌లో ప్రజలకు రక్షణ లేదని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని అన్నారు. రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారని అడిగారు. తొమ్మిది నెలల్లో తొమ్మిది కమ్యూనల్ సంఘటనలు చోటుచేసుకున్నాయని, కొమ్ము కాస్తున్న పోలీసు అధికారులు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దు అని, రేవంత్ రెడ్డిలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించబోమని తెలిపారు. ఎంఎల్‌ఎ గాంధీ భాష చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటోందని పేర్కొన్నారు. రాహుల్ జీ రేవంత్ రెడ్డిని మందలిస్తారా..? చర్యలు తీసుకుంటారా..? చూడాలని అన్నారు. లేదంటే రాహుల్ గాంధీని దేశంలో ఎవరూ నమ్మరు అని, పార్టీ మారిన ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి : కెటిఆర్
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎంఎల్‌ఎ ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా..? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటమేమిటన్నారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధేస్తుందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కెటిఆర్ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంఎల్‌ఎలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందని అన్నారు. కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బిఆర్‌ఎస్ బెదరదని కెటిఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర చేస్తున్నారని ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

ఆ దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు: టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు సర్వ సాధారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా విమర్శలు చేసే సమయంలో భాష చాలా ముఖ్యమని అన్నారు. దాడులు, ప్రతిదాడులను ఏ ఒక్కరూ సమర్ధించరని, అయినా, కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అరికెపుడి గాంధీ టెక్నికల్‌గా బిఆర్‌ఎస్ సభ్యుడేనని.. నిబంధనల మేరకే ఆయన పిఎసి చైర్మన్ అయ్యారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అవసరం తీరాక ఆంధ్రా సెటిలర్స్ అని మాట్లాడుతున్నారు : అద్దంకి దయాకర్
ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీని ఆంధ్రోడు అన్న వ్యాఖ్యలకు నవ్వొస్తుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఆంధ్రా సెటిలర్స్‌బతకడానికి వచ్చారని అవమానించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఆంధ్రా వాళ్ల ఓట్లు, సీట్లు చివరకు నోట్లు కూడా బిఆర్‌ఎస్ పార్టీకి కావాలి అని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్లు బిఆర్‌ఎస్ పరువు కాపాడారని పేర్కొన్నారు. అవసరం తీరిపోయిన తర్వాత ఆంధ్రా సెటిలర్స్ బతకడానికి హైదరాబాద్ వచ్చారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బిఆర్‌ఎస్ నాయకులకు పిచ్చి పట్టింది : మెట్టు సాయి
బిఆర్‌ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని ఫిషరిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి మండిపడ్డారు. వారికి మహిళలు అంటే చిన్నచూపు అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నేతలు సెటిలర్లతో లాభ పడి.. మళ్లీ వాళ్లను అడ్డుపెట్టుకుని వివాదం తెచ్చే పనిలో పడ్డారని ఆరోపించారు. ఇన్నాళ్లు ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. అధికారం పోగానే మళ్లీ ఆంధ్ర..తెలంగాణ లొల్లి మొదలైందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News