కరీంనగర్ సమీక్షా సమావేశం రసాభాస
ముగ్గురు మంత్రుల సాక్షిగా వాగ్వాదం, పరిస్థితి
చేయిదాటిపోవడంతో కౌశిక్‌ను బయటికి
పంపిన పోలీసులు సంజయ్ పార్టీ మారడంపై
నిలదీసిన కౌశిక్, నెట్టింట వైరల్‌గా మారిన
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వ్యాఖ్యలు ఇది హేయమైన
చర్య, ఇంతకు ముందెప్పుడూ చూడలేదు:
మంత్రి ఉత్తమ్ కౌశిక్‌రెడ్డి ప్రవర్తన సరైంది
కాదు: శ్రీధర్‌బాబు బిఆర్‌ఎస్ అగ్రనేతలు
స్పందించాలి: పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో: కరీంనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై జరిగిన సమీక్ష సమావేశం రసాభసాగా మారింది. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోని ఆడిటోరియంలో ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రసంగిస్తుండగా హుజురాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ‘సంజయ్‌కుమార్.. నువ్వు ఏ పార్టీ నుండి గెలిచావు.. ఏ పార్టీలో చేరావు’ అంటూ కౌశిక్‌రెడ్డి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య తోపులాటకు దారితీసింది.
సాక్షాత్తూ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో సమీక్ష రసాభాసగా మారడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ సమావేశానికి ఎం ఎల్‌ఎలు, అధికారులు హాజరయ్యారు. జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రసంగిస్తుండగా కౌశిక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈక్రమంలో వారిద్దరి మధ్య మాటలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో పాడి కౌశిక్‌రెడి, డాక్టర్ సంజయ్ ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన సహచర ఎంఎల్‌ఎలు, పోలీసులు అడ్డుకున్నా రు. ఈ దశలో సంజయ్‌ని ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి మాటలు తూలారు. ఇందుకు సం బంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ కూడా జోక్యం చేసుకుని కౌశిక్‌రెడ్డిని వారించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు కౌశిక్‌ను బయటకుతీసుకొచ్చారు.
ఇది హేయమైన చర్య: మంత్రి ఉత్తమ్
ఇది హేయమైన చర్య అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి విచక్షణ కోల్పోయి ప్రవర్తించారని, రాజకీయ దురుద్దేశంతోనే గొడవ పడ్డారన్నారు. పార్టీలకతీతంగా సమీక్ష సమావేశానికి ఉమ్మ డి జిల్లాలోని ఎంఎల్‌ఎలు అందర్నీ ఆహ్వానించామన్నారు. జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ మాట్లాడేటప్పుడు హుజురాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి మైక్ లాక్కుని దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. సమీక్ష డైవర్షన్ కోసమే కౌశిక్‌రెడ్డి హంగామా సృష్టించారన్నారు. రివ్యూ సమావేశం నుండి బయటకు వచ్చిన కౌశిక్‌రెడ్డి మీడియాతో మా ట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌కుమార్‌ది ఏపార్టీనో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు. బిఆర్‌ఎస్ నుండి వెళ్లిన 10 మంది ఎంఎల్‌ఎలు రాజీనామా చేసేదాకా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అధికారులకు, పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చిన హుజురాబాద్ ఎంఎల్‌ఎ మీకు జీతాలు పెంచింది. వాహనాలు సమకూర్చింది. స్టేషన్లను ఫైవ్‌స్టార్‌లా తీర్చిదిద్దింది కెసిఆర్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. మరో మూడేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రతీకారం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అన్న ఉత్తమ్ ముందే…
తన అన్న, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలోనే పాడి కౌశిక్‌రెడ్డి దూకుడు ప్రదర్శించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా జరుగుతున్న సమీక్షా సమావేశంలో పార్టీల విషయాలను ప్రస్తావనకు తీసుకురావడం ఏంటని కూడా సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. అయితే కౌశిక్‌రెడ్డికి, డాక్టర్ సంజయ్‌కి మధ్య సమీక్షా సమావేశంలో జరిగిన వాగ్వాదం రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంపై అధికార పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు.
సంఘటనపై రాష్ట్ర నేతలు కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు స్పందించాలి: మంత్రి పొన్నం
కరీంనగర్‌లో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని రాష్ట్ర రవాణా,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జరిగిన సంఘటనలో పార్టీలు మారని వారు జీవితకాలం ఒకేపార్టీలో ఉంటే దానికి ఒక అర్థం ఉంటుండేనని, పార్టీలు మారినవారు వైఎస్‌ఆర్‌సిపిలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ళు రువ్వి కాంగ్రెస్‌లోకి వచ్చి కాంగ్రెస్‌లో అవకాశాలు పొంది మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి పోయి ఆ పార్టీ నుండి ఏదో మాట్లాడితే అర్థం లేదని అన్నారు. జరిగిన సంఘటనపై బిఆర్‌ఎస్ నేతలు కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు స్పందించాలన్నారు. ఇటువంటి సంఘటనలు సమర్థిస్తున్నారా ఎంకరేజ్ చేస్తున్నారా? వీళ్లందరికీ ఆదర్శంగా మీరు బూతు మాటలు మాట్లాడే స్కూల్ పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
కౌశిక్‌రెడ్డి ప్రవర్తన సరైంది కాదు: శ్రీధర్‌బాబు
కరీంనగర్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో హుజురాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి వివాదాస్పదమైన ప్రవర్తన సరైంది కాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సమావేశంలో జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్‌ను తీవ్ర పదజాలంతో దూషించడం సరికాదన్నారు. ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులను సైతం కౌశిక్‌రెడ్డి నెట్టేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు.