n నన్ను హత్య చేసేందుకు ఈటల కుట్ర
n ఎంపిటిసి బాలరాజ్ హత్యలోనూ ప్రమేయం
n టిపిసిసి మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సిఎం కెసిఆర్ సమక్షంలోటిపిసిసి మాజీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి బుధవారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్‌కు నేర రాజకీయాలతో సుదీర్ఘ సంబంధం ఉందన్నారు. 2014లో జరిగిన మాజీ ఎంపిటిసి బాలరాజ్ హత్యలో ఈటల ప్రమేయం ఉందన్నారు. పైగా తనపైనే హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఈటల ఆరోపణలను హాస్యస్పదమన్నారు. ఈటలను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. వ్యక్తిగత ఎజెండా కోసం పోరాడుతున్న ఈటల రాజేందర్ను హుజూరాబాద్ ప్రజలు ఎన్నుకొని ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. గత 18 ఏళ్లుగా ప్రజలు ఈటలకు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ తన హయాంలో అభివృద్ధి ఏం జరగలేదన్నారు.
అప్పటి ఆర్థికశాఖ మంత్రిగా నియోజకవర్గానికి అభివృద్ధి నిధులను మంజూరు చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ అభివృద్ధి పక్కనపెట్టి స్వంత అభివృద్ధిపైనే దృష్టిపెట్టారన్నారు.హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను టిఆర్‌ఎస్ చేరుతున్నట్లు వెల్లడించారు. టిఆర్‌ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయనున్నట్లు తెలిపాడు. ఉప ఎన్నికలలో అధికార పార్టీకి మరో అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వం పట్ల టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డ్డి ఆసక్తి చూపలేదన్నారు. బదులుగా ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని చెప్పారన్నారు. ఇది పార్టీకి ద్రోహం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చరిత్రలో తుడిచిపెట్టుకు పోతుందని కౌశిక్‌రెడ్డ్డి అన్నారు.
నియోజక వర్గ ప్రజలతో చర్చించి
‘నియోజక వర్గ ప్రజలతో, బంధు, మిత్రులతో చర్చించి టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు టిపిసిసి మాజీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి పేర్కొన్నాడు. అభివృద్ధి జరగాలంటే టిఆర్‌ఎస్‌లో చేరాలని మిత్రులు, అనుచరులు, అభిమానులు కోరారు. ఈక్రమంలో బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కూడా నేను టిఆర్‌ఎస్‌లో చేరడానికి కారణమన్నారు. హుజురాబాద్‌లో దళిత బంధు ప్రారంభించడం చాలా సంతోషకరమని, ఏడున్నరేళ్లు ఈటల రాజేందర్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, తనను తాను వ్యక్తిగతంగా అభివృద్ధి చేసుకున్నారే తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు.