తాము మంగళవారం నాటి బంద్‌కు మద్దతు ఇస్తామని జెడిఎస్ నేత హెచ్‌డి కుమారస్వామి సోమవారం తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బంద్ ప్రశాంతంగా జరగాలని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు సహకరించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఏ విషయంపై అయినా ఎవరైనా నిరసనలకు దిగవచ్చునని, ఇది ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు. అయితే ఎటువంటి నిరసనలు, ఆందోళనలు అయినా శాంతియుతంగా ఉండాల్సిందేనన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసనల గురించి మాట్లాడారని, దీనిపై మద్దతు ఇవ్వాలా? వద్దా అనేది వారి ఇష్టానికి వదిలిపెడుతున్నట్లు చెప్పిన డికె శివకుమార్, కావేరీ జలాలకు సంబంధించి బంద్‌లు, నిరసనలు కుదరవని ఇంతకు ముందు న్యాయస్థానాలు చెప్పిన విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలన్నారు. ప్రచారం కోసం ఏదో రాజకీయ లబ్థికి ఈ విధంగా ప్రజలతో ఆడుకోవడం ఎవరికి తగదని స్పష్టం చేశారు. లీగల్ చర్యలను అంతా గుర్తుంచుకోవల్సి ఉంటుందన్నారు. అయినా బంద్‌లపై ఏకాభిప్రాయం లేదని, వేర్వేరుగా బంద్‌లకు పిలుపు ఇచ్చారని, ఏది ఏమైనా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శివకుమార్ తెలిపారు.