సబ్బండ వర్ణాల పండుగ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
బతుకమ్మ పండుగ
అమ్మతో బతుకమ్మ ఆడిన ఎంఎల్‌సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ’బతుకమ్మ’ పండుగ అని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ వేడుకలలో భాగంగా మొదటి రోజున ఆదివారం (ఎంగిల పూల బతుకమ్మ)ప్రగతి భవన్‌లో జరిగిన వేడుకలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత తల్లి శోభమ్మ (సిఎం కెసిఆర్ సతీమణి), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం కవిత మాట్లాడుతూ, తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికి గర్వకారణమన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు సిఎం కెసిఆర్ పుట్టింటి కానుకగా కోటికి పైగా చీరలను అందిస్తూ మహిళలకు గొప్ప గౌరవాన్ని అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కేవలం మన రాష్ట్రంలోనే గాక, దేశ విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలంతా వారి ప్రాంతంల్లో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎనిమిది దేశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ముంబై లాంటి కీలక నగరాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందోని కవిత తెలిపారు.