Monday, December 23, 2024

కవిత అరెస్టు ఎన్నికల స్టంట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్, బిజెపి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరగడం తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందన్నా రు. కవితను అరెస్ట్ చేయడం ద్వారా ఆ క్రెడిట్‌ను బిజెపి, అరెస్ట్ ద్వారా బిఆర్‌ఎస్ సానుభూతిని పొందే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన తనకు సంపూర్ణ సంతృప్తి ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మూడు నెలల పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించిన తెలంగాణ సమాజానికి సహచర మంత్రులకు, ఉద్యోగులకు సిఎం ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు అయిన నేపథ్యంలో శనివారం సిఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మార్పు కావాలి, -కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో, ఆరు గ్యారంటీల హామీలతో ఎన్నికల్లో ప్రజాతీర్పును కోరామన్నారు. ప్రజల ఆమోదంతో డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మొదలైందని, ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలన్న తపనతోనే పని చేస్తున్నామని ఆయన తెలిపారు. పదేళ్లలో కెసిఆర్ వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని, గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముడులు వేస్తే వాటిని ఒక్కొక్కటిగా విప్పుతున్నామన్నారు. ఈ వందరోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని భావించడం లేదని, ఇంకా పెండింగ్ లో ఉన్న హామీలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తామని ఆయన తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి కోసం 2050 పేరుతో ఓ మెగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఈ విషయంలో సంప్రదింపులు ప్రారంభిస్తామని సిఎం ప్రకటించారు. తాము అధికారం చేపట్టగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో భవనాల పంపకాలు కూడా పూర్తి చేశామన్నారు. కేంద్రంతో పంతానికి పోవద్దని నిర్ణయించామన్నారు. పంతానికి పోతే రాష్ట్రానికి నష్టమని, అందుకే సయోధ్యతో పని చేయాలన్నదే తమ విధానం అన్నారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న కృతనిశ్చయంతో ముందుకెళుతున్నామన్నారు. పక్క రాష్ట్రంతో కూడా ఘర్షణ పడకుండా సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ నకలుగా మారిన టిఎస్‌ను టిజిగా మార్చామన్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రులు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహారిస్తున్నారని సిఎం రేవంత్ కొనియాడారు.
కెసిఆర్ మౌనానికి అర్థం ఏమిటి?
కవితను అరెస్ట్ చేస్తే తండ్రిగా కాకపోయినా పార్టీ అధ్యక్షుడిగా అయినా కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కవిత అరెస్ట్‌పై కెసిఆర్, నరేంద్ర మోడీ మౌనం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలవబోతున్నాని అన్ని సర్వేలు చెబుతున్నాయని అందువల్ల కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికే బిఆర్‌ఎస్, బిజెపి ఈ చీఫ్ పొలిటికల్ డ్రామాకు తెరలేపాయని రేవంత్ ధ్వజమెత్తారు. ఇకనైనా మోడీ, కెసిఆర్ ఈ డ్రామాలను కట్టిపెట్టాలన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోడీ వచ్చేవారని కానీ, నిన్న మాత్రం మోడీ, ఈడీ కలిసే వచ్చారని సిఎం రేవంత్ సెటైర్ వేశారు. కెసిఆర్ కుటుంబం, బిజెపి నిరంతర ధారావాహిక సీరియల్ లాగా లిక్కర్ స్కామ్ నడిపిస్తున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రానికి మోడీ చేసిందేమీ లేదని, ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు.

తెలంగాణను అవమానించిన మోడీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదని రేవంత్ మండిపడ్డారు. మోడీ 14 ఏళ్లు సిఎం గా చేశారు. 10 ఏళ్లు ప్రధానిగా చేశారు. అలాంటి వ్యక్తి రాష్ట్ర ఏర్పాటునే అవహేళన చేసి మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో కెసిఆర్ చేసిన అవినీతిపై మోడీ ఎందుకు కేసు పెట్టలేదని రేవంత్ ప్రశ్నించారు. దళితుడు పార్టీ అధ్యక్షుడు అయితే కొన్ని రోజులు బిజెపి తట్టుకోలేక పోయిందని, అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుటుంబాన్ని బిజెపి రోడ్డున పడేసిందన్నారు. బంగారు లక్ష్మణ్ కూతురు తన దగ్గర వచ్చి అనేక విషయాలు చెప్పుకుందని ఆయన తెలిపారు. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసి మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని సిఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులకు ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశామన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు వచ్చే లా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా భవన్‌ను ప్రజల కు అందుబాటులోకి తీసుకొచ్చామని, సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. సచివాలయం నిషేధిత ప్రదేశంలా గ త ప్రభుత్వం వ్యవహారించిందని దానిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మేం పాలకులం కాదు, ప్రజా సేవకులం అని ప్రజలకు తేల్చి చెప్పామన్నా రు. ప్రజా సంఘాలతో ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు స్వీకరించామని, ఈ ప్రభుత్వంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నాం, మార్పు మొదలైందని, మార్పు జరుగుతోందని ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నామన్నారు.
మహాలక్ష్మీకింద 26 కోట్ల మంది మహిళలకు..
గత పదేళ్లలో ప్రభుత్వం పరిపాలనను బిఆర్‌ఎస్ అస్తవ్యస్తం చేసిందని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపిందని సిఎం దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేదని, తాము మాత్రం ప్రజల్లోనే ఉన్నామని ఆయన తెలిపారు. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశామని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారని, ఇప్పటివరకు 26 కోట్ల మంది దానిని సద్వినియోగం చేసుకున్నారని ఆయన వివరించారు. ఉచిత విద్యుత్ హామీ అమల్లో భాగంగా 38 లక్షల మంది లబ్ధిదారులకు జీరో బిల్లులు అందజేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతోపాటు 8 లక్షల మందికి 500 రూపాయలకే సిలిండర్‌ను అందచేశామన్నారు. ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా పనిచేస్తున్నామని, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహారించి ఆదాయాన్ని స్థిరీకరించామని సిఎం పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క తెలంగాణ ప్రాజెక్టు పూర్తి కాలేదని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని రేవంత్ తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ టిఎస్పీఎస్సీని అవినీతికి అడ్డాగా మార్చిందని సిఎం రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిని ప్రక్షాళన చేపట్టిందని వివరించారు.
వాళ్లు కుట్రలు చేస్తే మేము ఊరుకుంటామా ?
శాసనసభ సమావేశాల్లో కడియం శ్రీహరి, అంతర్గత చర్చల్లో కెసిఆర్ మా ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయం, పడగొడతామని అన్నారని సిఎం రేవంత్ అన్నారు. అదేవిధంగా బిజెపి నాయకులు డా.లక్ష్మణ్ కూడా పార్లమెంట్ ఎన్నికల తరవాత ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారని, వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8మంది ఎమ్మెల్యేలని, ఏ లెక్కలు కూడిన కూడా వీళ్లకు లెక్క కుదరదని ఆయన ఎద్దేవా చేశారు. వాళ్లిద్దరూ కలిసి తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే తప్ప, వాళ్లు అనుకుంటున్న కార్యాచరణ జరగదని, అలా చేస్తే మేమైనా చూస్తూ ఊరుకుంటామా? అని సిఎం రేవంత్ రెడ్డి అన్నా రు. మమ్మల్ని దెబ్బతీసేందుకు బిజెపి, బిఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
మేము తలుచుకుంటే బిఆర్‌ఎస్‌లో ముగ్గురే మిగులుతారు
ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచిస్తే ప్రతిపక్షం వద్ద ఎవరూ ఉండరని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే నా తడాఖా చూపిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన ఉంటే టైం తేదీ నిర్ణయించుకోవాలని, తాము తలుచుకుంటే బిఆర్‌ఎస్‌లో ముగ్గురే మిగులుతారని సిఎం రేవంత్ హెచ్చరించారు. ఉదయం లేచేసరికి ఒంటిమీద బట్టలు కూడా మిగలవని ఆయన అన్నారు. మమ్మల్ని టచ్ చేస్తే కథ వేరే ఉంటుందన్నారు. తన పని తనను చేసుకోనివ్వాలని సిఎం రేవంత్ సూచించారు. నా ప్రణాళిక నాకు ఉందని, పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండమని రేవంత్ చెప్పారు. నలభై ఏళ్లు రాజకీయ అనుభం ఉన్న కెసిఆర్ నల్లగొండ సభలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సమర్ధించుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలోని గందరగోళాన్ని హరీష్‌రావు పరోక్షంగా చెబుతున్నారన్నారని సిఎం రేవంత్ అన్నారు. బిఆర్‌ఎస్ పెద్దలు మన ప్రభుత్వమే రాబోతుందని వాళ్ల ఎమ్మెల్యేలకు చెబుతున్నారంట,ఈ విషయాన్ని తనను కలిసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారని, కొందరు బిఆర్‌ఎస్ నేతలకు మంత్రి పదవులను సైతం కెసిఆర్ పంచేస్తున్నారని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ఇబ్బంది వస్తే తాము మద్దతిస్తామని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనకు చెబుతున్నారని, 10 ఏళ్లలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని రేవంత్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News