జగిత్యాల : తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం రాయికల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.
మన లక్ష్యం ఒక్కటే ఉండాలి. గులాబీ కండువా అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారు. గులాబీ జెండా ఎగిరే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. అందుకో సం 24 గంటలు కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఒకప్పుడు రాయికల్ వలసల మండలంగా ఉండే. ఇప్పుడు పంటలమయం అయిపోయింది. కాంగ్రెస్ హయాంలో కేవలం 20 వేల ఎకరాల్లో వరి సాగు జరిగేది. కెసిఆర్ సిఎం అయ్యాక 65 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతుంది. రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందని కవిత తెలిపారు.
మన సిఎం మోడీ వస్తున్నాడని ముఖం చాటేశారని జీవన్ రెడ్డి అంటున్నాడు. మరి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణకు వచ్చిండు. ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వచ్చిండో.. మునుగోడు ప్రజలకు కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేశారు. మా నాయకుడు ఎప్పుడూ కూడా ముఖం చాటేయలేదు. ముఖం చాటేసేది బిజెపి, కాంగ్రెస్ నాయకులు మాత్రమే. అనుకున్న లక్ష్యం సాధించే వరకు నిలబడే నాయకుడే నిజమైన నాయకుడు అని కవిత స్పష్టం చేశారు.